Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంఅగ్రరాజ్యంలో భిన్న స్వరాలు

అగ్రరాజ్యంలో భిన్న స్వరాలు

- Advertisement -

– దాడులపై రిపబ్లికన్లలోనూ వ్యతిరేకత
– ట్రంప్‌నకు కొందరు డెమొక్రాట్ల మద్దతు… అమెరికా రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి
ఇరాన్‌ అణు స్థావరాలపై జరిపిన ఆకస్మిక దాడుల విషయంలో అమెరికాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీలో కూడా ఏకాభిప్రాయం కన్పించడం లేదు. అధ్యక్షుడి అధికారాలపై అంతర్జాతీయ సమాజంలో చర్చ నడుస్తోంది. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమంపై గత కొంత కాలంగా ట్రంప్‌ మండిపడుతూనే ఉన్నారు. చివరికి టెహ్రాన్‌పై బంకర్‌ విధ్వంసక బాంబు దాడులు జరిపారు. దీనిపై స్వదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ట్రంప్‌ చర్యను కొందరు ప్రతిపక్ష డెమొక్రాట్లు సమర్ధించగా అధికార రిపబ్లికన్లు వ్యతిరేకించారు.
న్యూఢిల్లీ :
అమెరికా సైనిక చర్య గురించి సమాచారం వెలువడగానే పెన్సిల్వేనియాకు చెందిన డెమొక్రాట్‌ జాన్‌ ఫెట్టర్‌మాన్‌ దానిని స్వాగతించారు. అలాగే గతంలో కొన్ని దశాబ్దాల పాటు డెమొక్రటిక్‌ పార్టీలో నాయకత్వ పాత్ర పోషించిన మేరీలాండ్‌ నేత స్టెనీ హోయర్‌ కూడా దాడులను సమర్ధించారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా ఇరాన్‌ను నిరోధించాలంటే దాడులు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. 2028 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా భావిస్తున్న పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ షపిరో ఓ ప్రకటన చేస్తూ ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమం ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది డెమొక్రాట్లు మౌనం వహిస్తున్నారు. చక్‌ షుమెర్‌ వంటి ప్రముఖ సెనెటర్లు మాత్రం దాడులకు ముందు ప్రతినిధి సభను సంప్రదించకపోవడం పరిపాలనా వైఫల్యమేనని తెలిపారు. అయితే వారు అమెరికా దాడులను వ్యతిరేకించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్‌ అనుమతి అవసరమా?
అమెరికా పాలనా వ్యవస్థలో యుద్ధాన్ని ప్రకటించే అధికారం ప్రతినిధి సభ (కాంగ్రెస్‌)కు మాత్రమే ఉంటుంది. అయితే ముప్పు ఎదురైనప్పుడు దానిపై స్పందించేందుకు కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా దేశాధ్యక్షు డికి విస్తృత అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్‌పై దాడి వంటి విషయాలలో అమెరికా పాత్ర చాలా పరిమితంగా ఉన్నప్పుడు అధ్యక్షుడు తన అధికారాలను వినియోగించుకోవచ్చునన్నది ట్రంప్‌ సమర్ధకుల వాదన. ఒకవేళ అమెరికా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వస్తే అప్పుడు కాంగ్రెస్‌ అనుమతి అవసరమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
వామపక్షాల మండిపాటు
ఇదిలావుండగా బెర్నీ శాండర్స్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌ వంటి వామపక్ష వాదులు అమెరికా దాడులను తీవ్రంగా, బహిరంగంగా వ్యతిరేకించారు. ఒకాసియో-కోర్టెజ్‌ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్‌ను అభిశంసించాలని డిమాండ్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇరాన్‌పై దాడి చేయాలనే ట్రంప్‌ వినాశకర నిర్ణయం రాజ్యాంగాన్ని, యుద్ధ నిర్ణయంపై ప్రతినిధి
సభకు ఉన్న అధికారాన్ని తీవ్రంగా ఉల్ల్లంఘించడమే అవుతుంది. తరతరాలు గా మనల్ని ఊబిలోకి లాగేలా చేసే యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఆయన సాహ సం చేశారు.ట్రంప్‌ను అభిశంసించడానికి ఇది స్పష్టమైన కారణమే’ అని అన్నారు.
రిపబ్లికన్లలో యుద్ధ భయం
పాలకపక్షమైన రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ చర్యకు పూర్తి మద్దతు లభించడం లేదు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సైతం కొత్తగా యుద్ధం వచ్చి పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఇరాన్‌పై అమెరికా ప్రజలలో సదభిప్రాయం లేదు. 1979 నాటి బందీల సంక్షోభాన్ని, ఇరాన్‌ మద్దతుతో జరిగిన దాడులను వారు మరచిపోలేదు. ఇక మీడియా ప్రముఖులైన ట్యూకర్‌ కార్ల్‌సన్‌, స్టీవ్‌ బానన్‌లు ఇరాన్‌పై దాడి చేయవద్దని ట్రంప్‌కు బహిరంగంగానే సూచించారు. జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌, ట్రంప్‌ క్యాబినెట్‌ సభ్యురాలు తులసీ గబ్బార్డ్‌ ఓ వీడియోను రూపొందించి అణు ఘర్షణ కారణంగా జరిగే వినాశనాన్ని తెలియజేశారు. మరోవైపు తన చర్యను వ్యతిరేకిస్తున్న వారందరి పైన ట్రంప్‌ నిప్పులు చెరుగుతున్నారు. తులసీ గబ్బార్డ్‌ను మంత్రి పదవి నుండి తప్పిస్తానని కూడా చెప్పారు. ఇక ప్రతినిధి సభలో ట్రంప్‌ భాగస్వామి అయిన మర్జోరీ టేలర్‌ గ్రీనే ఇరాన్‌పై దాడిని వ్యతిరేకించారు. ‘అమెరికా గొప్పగా ముందుకు సాగుతున్న ప్రతి సందర్భంలోనూ మనం మరో విదేశీ యుద్ధంలో చిక్కుకుంటున్నాం. ఇది మన పోరాటం కాదు. శాంతే సమాధానం’ అని జార్జియాకు చెందిన ఆమె తెలిపారు.
కాంగ్రెస్‌ను ఎందుకు సంప్రదించలేదంటే…
కీలకమైన జాతీయ భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షులు కాంగ్రెస్‌ను సంప్రదించడం పరిపాటిగా వస్తోంది. కాంగ్రెస్‌ మద్దతుతో దేశాధ్యక్షుడు చేపట్టే చర్యలకు విస్తృత సానుకూలత లభిస్తుంది. మరి ట్రంప్‌ ఆ సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించలేదు? ఇరాన్‌ విషయంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు దాదాపుగా ఒకే వైఖరితో ఉన్నారు. అయితే పరస్పరం బహిరంగంగా సహకరించుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రతి పార్టీకి తన సొంత ప్రయోజనాలు ఉంటాయి. వేరే పార్టీతో రాజీ పడేందుకు ఇష్టపడదు. ప్రతిపక్ష పార్టీపై ట్రంప్‌ మద్దతుదారులకు అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి డెమొక్రాట్ల మద్దతు ట్రంప్‌కు బలాన్ని చేకూర్చదు. వచ్చే సంవత్సరం ప్రైమరీ ఎన్నికలు జరగాల్సి ఉంది. డెమొక్రాట్ల నాయకత్వం కానీ, ప్రతినిధులు కానీ ట్రంప్‌ను సరిగా ప్రతిఘటించలేదన్న అభిప్రాయం ఏర్పడితే అది వారికే ప్రతికూలమవుతుంది. ఎందుకంటే డెమొక్రాట్లకు ట్రంప్‌ వంటి నేత లేడు. నేటి అమెరికా రాజకీయాలలో మరో పార్టీతో ఏకీభవించడం కంటే ప్రమాదకరం మరోటి లేదు. సమస్య ఏదైనప్పటికీ రాజకీయ ప్రత్యర్థులను బహిరంగంగా వ్యతిరేకిస్తేనే విలువ ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్‌ను ట్రంప్‌ సంప్రదించలేదని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -