– అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యనందిస్తాం : అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సాంప్రదాయ విద్యావిధానంతో పాటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ విద్యా విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో వైద్యవిద్యపై ఉన్నతస్థాయి సమీక్షను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమాన, నాణ్యమైన విద్యను అందించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏటా 4,140 మంది ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నారనీ, రాష్ట్రంలో కాలేజీల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై రాజీలేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చదివిన వైద్యులకు ప్రపంచ గుర్తింపు లభిస్తున్నదనీ, అదే స్థాయి బోధనను కొత్తగా ఏర్పాటైన జిల్లాల కాలేజీల్లోనూ అందించాలని సూచించారు. ఉస్మానియా విద్యార్థికైనా, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థికైనా ఒకే రకమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలని ఆకాంక్షించారు. మెడికోలు ప్రాక్టికల్ నాలెడ్జిని పెంపొందించుకోవాలనీ, అందు కోసం తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్లిష్టమైన అనాటమీ, సర్జికల్ ప్రొసీజర్ల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వర్చువల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ టూల్స్, వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన పద్ధతులను వినియోగించాలని సూచించారు. ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలనీ, ఆ కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి భవిష్యత్ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని ఇతర కళాశాలలకు మెంటార్, శిక్షణా కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలోకి మార్చి, నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేయాలని సూచించారు. బోధనాస్పత్రుల్లో రద్దీ దృష్ట్యా, విద్యార్థులకు క్లినికల్ కేస్ స్టడీలను వివరించేందుకు టెలీమెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి కళాశాలలో అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఐటీ అడ్మినిస్ట్రేటర్లు, టెక్నీషియన్లను నియమించాలనీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు జరగాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, పనితీరును ఏఐ టూల్స్ ద్వారా నిరంతరం విశ్లేషించాలని సూచించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



