– 16 ఏండ్ల దళిత బాలికపై సామూహిక లైంగికదాడి
– బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి
– కేసు నమోదు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని కౌషాంబి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. 16 ఏండ్ల దళిత బాలికపై కొందరు దుర్మార్గులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై దళిత, మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో దళితులు, మహిళల భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత తీరుపై ఆందోళనను వెలిబుచ్చాయి.
పోలీసులు, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 24న బాధితురాలు అదృశ్యమైనట్టు మిస్సింగ్ రిపోర్ట్ నమోదైంది. తన కూతురిపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారని వారి గ్రామానికే చెందిన శైలేంద్ర సరోజ్ అలియాస్ జహీద్, అతని స్నేహితుడు షేరు అలియాస్ నాజర్ అహ్మద్, మరొక గుర్తుతెలియని వ్యక్తిపై ఏప్రిల్ 27న బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామని తన కూతురిని బెదిరించారని కూడా పేర్కొన్నాడు.
దీంతో ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి రాజేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవటానికి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. యూపీలో దళితులకు, మహిళలకు భద్రత లేదని దళిత, మహిళా సంఘాలు ఆరోపించాయి. శాంతి భద్రతల పరంగా యూపీని చక్కని రాష్ట్రంగా తీర్చి దిద్దామని చెప్తున్న యోగి సర్కారు.. ఇలాంటి దారుణాల పట్ల ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించాయి. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకొని, కఠినంగా శిక్షించాలనీ, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. దళితులు, మహిళల భద్రత పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సదరు దళిత, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
యూపీలో ఘోరం
- Advertisement -