డబ్ల్యూటీఓను కోరిన బ్రెజిల్
బ్రసిలియా : తనపై అమెరికా విధించిన అధిక సుంకాల భారం నుంచి ఉపశమనం పొందేందుకు సహక రించాలని, ఇందుకోసం సంప్రదింపులు జరపాలని దేశాధ్య క్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థను కోరింది. ఈ మేరకు డబ్ల్యూటీఓలో బ్రెజిల్ పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ వర్గాలు ఏఎఫ్‌పీ, అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలకు తెలియజేశాయి. బ్రెజిల్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యాభై శాతం సుంకాలు విధిం చిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొ నారోను బ్రెజిల్ ప్రభుత్వం విచారిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆ దేశంపై అధిక సుంకాలతో ప్రతీకార చర్యకు దిగారు.
ఈ నెలలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటి వరకూ బ్రెజిల్, భారత్‌పై అత్యధికంగా యాభై శాతం చొప్పున సుంకాలు విధించింది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారత్‌పై అమెరికా భారీగా జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా డబ్ల్యూటీఓ ముందుకు వాణిజ్య వివాదాలు వచ్చినప్పుడు ముందుగా సంప్రదింపుల ప్రక్రియను చేపడతారు. ఆర్థిక వివాదాల పరిష్కారానికి డబ్ల్యూటీఓ అంతర్జాతీయ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సంస్థ చేపట్టే సంప్రదింపుల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంటుంది. చాలా సందర్భాలలో అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న 35.9 శాతం ఉత్పత్తులపై టారిఫ్ భారం ఎక్కువగా ఉంటుందని బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో ఆల్కమిన్ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ చేస్తున్న ఎగుమతులలో ఇది నాలుగు శాతానికి సమానం.
చర్చల ప్రసక్తే లేదు : లూలా
అందుకు సిద్ధపడి అవమానపడనని స్పష్టీకరణ
రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్డుకుంటున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఆరోపించారు. ట్రంప్ సిద్ధపడితే ఆయనతో చర్చించాలని తొలుత అనుకున్నానని, అయితే ఇప్పుడు ఆయన సంప్రదింపులకు సుముఖంగా లేరని తాను భావిస్తున్నానని, అలాంటప్పుడు చర్చలకు సిద్ధపడి అవమానపడదలచుకోలేదని చెప్పారు. ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇక అవకాశం లేదని స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోనూ, మొత్తంగా లాటిన్ అమెరికాలోనూ జోక్యం చేసుకునే చరిత్ర అమెరికాకు ఉన్నదని అంటూ అందులో భాగమే ఈ సుంకాల బెదిరింపులని తెలిపారు. 1964 కుట్ర సమయంలో తాము అమెరికా జోక్యాన్ని క్షమించామని అన్నారు. ‘కానీ ఇప్పుడు అమెరికా జోక్యం చిన్నదేమీ కాదు. బ్రెజిల్ వంటి సార్వభౌమాధికారం కలిగిన దేశానికి నిబంధనలను నిర్దేశించగలనని అమెరికా అధ్యక్షుడు అనుకుంటున్నారు. అది ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేశారు.
అమెరికా విధించిన సుంకాలపై బ్రిక్స్ ఆర్థిక వాణిజ్య కూటమిలో కూడా చర్చిస్తామని లూలా తెలిపారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించబోవడం లేదని, అలాగే క్యాబినెట్ స్థాయి చర్చలకు తన ప్రభుత్వం స్వస్తి చెప్పబోదని ఆయన వివరించారు. తాను మాత్రం ట్రంప్‌కు ఫోన్ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ విధించిన కొత్త సుంకాలతో బ్రెజిల్, అమెరికా సంబంధాలు 200 సంవత్సరాలు వెనక్కి పోయాయని అన్నారు. బోల్సొనారోపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోదని తెలిపారు. ట్రంప్ జోక్యాన్ని కోరినందుకు బోల్సొనారో మరో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటూ ఆయన మాతృభూమికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ట్రంప్‌తో తనకు వ్యక్తిగత పేచీలేవీ లేవని చెప్పారు. వచ్చే నెలలో ఐరాసలో కానీ, నవంబరులో ఐరాస వాతావరణ చర్చల్లో కానీ తాము కలుసుకోవచ్చునని అన్నారు. అయితే అధ్యక్ష భవనానికి అతిథులుగా వచ్చిన దక్షిణిఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలను ట్రంప్ అవమానించారని లూలా గుర్తు చేశారు.
టారిఫ్‌ల గుదిబండ షురూ..
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల్లో భాగంగా గురువారం నుంచి తొలుత ప్రకటించిన 25 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 6న ప్రకటించిన మరో 25 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు చేయనుంది. దీంతో ఈ నెల చివరి నుంచి దాదాపు 50 శాతం టారిఫ్‌లను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్‌ను అత్యంత సన్నిహిత మిత్రదేశంగా పేర్కొంటూనే 50 శాతం టారిఫ్‌లను విధించిన ట్రంప్ చర్యలతో ప్రధానంగా భారత ఎగుమతి రంగాలైన ఆటో పరికరాలు, స్టీల్, అల్యూమినియం, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్‌టైల్స్, సముద్రపు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థతో తెలుగు రాష్ట్రాలోని పలు ఎగుమతులపై ప్రభావపడనున్నది. ముఖ్యంగా రొయ్యల ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారతదేశ మొత్తం రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ రంగంపై దాదాపు 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అంచనా.
అమెరికా సుంకాలపై చర్చించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES