నవతెలంగాణ -అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శనివారం స్విచ్చాన్ చేసి ప్రారంభించారు. దీంతో పట్టణ ప్రధాన రహదారులు విద్యుత్ వెలుగులతో ప్రకాశించనున్నాయి.
నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అశ్వారావుపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 2023 జూన్ 2న సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారి 325బీ పై పేరాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం రోడ్డులోని కాకతీయ గేట్ వరకు రెండు కిలోమీటర్ల మేర రూ.9 కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే అశ్వారావుపేట–బూర్గంపాడు రహదారిలో పోలీస్ స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు సమాచారం.
అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అశ్వారావుపేట మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారడంతో పనుల అమలులో పలు దశలు కొనసాగాయి. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్‌బాబు పర్యవేక్షణలో, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృషితో పనులు వేగవంతమైనట్లు అధికారులు తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ విద్యుదీకరణ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభంతో పట్టణ ప్రధాన రహదారుల రూపురేఖలు మారడంతో పాటు రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు మెరుగైన వెలుతురు అందనుంది. రహదారి భద్రతకు, పట్టణ సుందరీకరణకు ఈ ఏర్పాటు దోహదపడనుంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్‌బాబు, కౌన్సిలర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, డీఆర్‌డీఏ అధికారి విద్యాలత, ఎస్పీ రోహిత్ రాజు, ఆర్ అండ్ బీ విద్యుదీకరణ విభాగం డీఈ అన్వేష్, ఏఈ టైటస్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)