పంటల ఉత్పత్తి నుండి ఆహార పదార్థాల శుద్ధి, తయారీ, పంపిణీ వరకు.. వేతనంతో కూడిన లేదా వేతనం లేని మహిళల శ్రమ వారి కుటుంబాలకు, సమాజాలకు, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోంది. అయినప్పటికీ, వారికి పురుషులతో సమానమైన గుర్తింపు లేదు, అధికారం లేదు. దీని వల్ల తక్కువ ఆదాయాన్ని పొందుతూ, తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహార భద్రత, గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామీణ మహిళలు పోషించే కీలకమైన పాత్రను గుర్తించి, ప్రోత్సహించటం గ్రామీణ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
(అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం)
మొదటి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం 1995 అక్టోబర్ 15 వ తేదీన ‘ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్’ (Women’s World Summit Foundation) రూపకల్పన చేసి నిర్వహించింది. ఆ తర్వాత 2007 డిసెంబర్ 18న, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 62/136 తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఈ తేదీని అధికారికంగా గ్రామీణ మహిళా దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ ఆహార వ్యవస్థలలో గ్రామీణ మహిళలు, బాలికలు పోషించే కీలక పాత్రను ఇది నొక్కి చెబుతుంది.
రైతులుగా గుర్తింపు లేదు
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళలలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. సాగుదారులుగా, కౌలు రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, పశు పోషకులుగా, మత్స్య కారులుగా, అటవీ ఉత్పత్తుల సేకరణ దారులుగా, రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొంటున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఎందుకంటే భూమి కలిగి వుండి పంటలు పండిస్తున్న వారినే అధికారికంగా రైతులుగా గుర్తిస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై వున్న వారిని ముఖ్యంగా మహిళలను రైతులుగా గుర్తించటం లేదు. తాజా వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో మహిళలు మొత్తం సాగు విస్తీర్ణంలో 12 శాతం భూమిని కలిగి ఉన్నారు. మొత్తం కమతాలలో మహిళల కమతాలు దాదాపు 14% మాత్రమే ఉన్నాయి.
ఎన్ని చట్టాలు వచ్చినా...
వ్యవసాయం చేసే మహిళలకు భూమి హక్కులు లేకపోవటానికి కారణం సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ. వారికి సమాన ఆస్తి హక్కు కల్పించటానికి తీసుకొచ్చిన చట్టాలను ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా అమలు జరపకపోవటం కూడా ఒక కారణం. తెలంగాణలో గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేయటంతో పాటు బీడీ కార్మికులుగా, చేనేత కార్మికులుగా, ఇటుక బట్టీ కార్మికులుగా ఇంకా అనేక కూలీ పనులు, వేతనం లేని పనులు చేస్తున్నారు. కానీ ఆయా రంగాలలో నెలసరి ఆదాయాలు అతి తక్కువ. గ్రామాలలో పని దొరకక గ్రామీణ మహిళలు నగరాలకు, దగ్గరలోని పట్టణాలకు వెళ్ళి గృహ కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కొందరు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు స్థానిక పరిశ్రమలలో కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. వీరికి సరైన వేతనాలు, అనుకూలమైన పని పరిస్థితులు, సాంఘిక భద్రతా పథకాలు అందడం లేదు.
ఉపాధి దొరకక
మరో వైపు తెలంగాణ భూ వినియోగంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. సాగు భూములు పెద్ద ఎత్తున వ్యవసాయేతర అవసరాల పేరుతో, రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి. ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక ప్రాంతాల పేరుతో ప్రభుత్వం భూములు లాక్కోవడం వల్ల, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా అసైన్డ్ భూముల రైతు కుటుంబాలు నిర్వాసితులై పోతున్నారు. ఈ పరిణామం కారణంగా గ్రామీణ మహిళలకు స్థానికంగా ఉపాధి దొరకటం లేదు, వారికి చేతిలో పని లేదు. ఆదాయం లేదు. రాష్ట్రంలో పంటల వైవిధ్యం తగ్గిపోయి ఎక్కువ శాతం సాగు భూమిలో వరి, పత్తి పంటలు ఆక్రమించాయి. వరిలో యాంత్రీకరణ (నాట్లు, కోత/ నూర్పిడి) పెద్ద ఎత్తున పెరిగిపోయి, పంటల సస్య రక్షణలో, కలుపు నియంత్రణకు విషరసాయనాల వినియోగం విస్తృతంగా పెరిగింది. మహిళా వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బకొడుతున్నాయి. పొలాలలో పని చేస్తున్న మహిళల ఆరోగ్యాలను ఈ రసాయనాలు పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్, తదితర జబ్బుల పెరుగుదలకు వీటి వినియోగానికి సంబంధం ఉంది.
ఒత్తిడిలో బతుకుతున్నారు
1990లలో దేశంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక సంస్కరణలతో అన్ని రంగాలు ప్రైవేటీకరణకు గురైన క్రమంలో వ్యవసాయ రంగంలో గత మూడు దశాబ్దాలకు పైగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. 1995 నుండి 2024 వరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో 4 లక్షల 11వేల మందికి పైగా రైతులు వ్యవసాయ సంక్షోభ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో 15% వరకు మహిళా రైతులున్నారు. పురుష రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలోని మహిళలు, ఆ అప్పుల భారాన్ని మోస్తూ, వ్యవసాయాన్ని కొనసాగిస్తూ, కుటుంబ పోషణ సాగిస్తూ విపరీతమైన ఒత్తిడిలో బతుకుతున్నారు. వాతావరణ మార్పులు, వాతావరణ సంక్షోభం మూలంగా కూడా అందరికంటే ఎక్కువగా బాధింపపడుతున్నది కూడా మహిళలే . పంట నష్టం, ఆదాయాలు తగ్గిపోవటం, ప్రభుత్వ మద్దతు వ్యవస్థలు అందుబాటులో లేకపోవటం వల్ల ఉన్న ఊళ్ళో పనులు లేక పురుషులు వలస పోవటం మూలంగా కూడా మహిళలపైనే అధిక భారం పడుతున్నది. రకరకాల వేదింపులు, హింసను ఎదరుకుంటున్నారు.
నిర్ణయాధికారం లేదు
అంతర్జాతీయంగా మహిళలు వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 80% దోహదం చేస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఆహార/వస్తు ఉత్పత్తిలోనూ సామాజిక ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న మహిళలకు భూమి వంటి సహజ వనరులపై అధికారం/హక్కులు లేవు. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ వ్యవసాయంలోనూ నిర్ణయాధికారం లేదు. ఈ నేపధ్యంలో 2026ను ఐక్య రాజ్య సమితి ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతుగా విధానాలలో సంస్కరణలను తీసుకురావటానికి, మహిళలకు వ్యవసాయ వనరులపై హక్కులను కల్పించే దిశలో పనిచేయటానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
వారి పాత్రను ఎలుగెత్తి చాటాలి
2015 లో జాతీయ స్థాయిలో ఏర్పడిన మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం)రెండేండ్ల పాటు చేసిన నిరంతర కృషి ఫలితంగా 2017లో కేంద్ర వ్యవసాయ మంత్రి అక్టోబర్ 15 వ తేదీని ‘మహిళా రైతుల దినోత్సవం’గా ప్రకటించి దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుండి భారత దేశంలో ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన కార్యాలయాలు, పరిశోధనా సంస్థలు అక్టోబర్ 15వ తేదీన మహిళా రైతుల దినోత్సవంగా జరుపుతున్నాయి. మహిళా రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని సత్కరిస్తున్నారు. మహిళా రైతులు, వ్యవసాయ కూలీలతో పనిచేసే సంస్థలు, సంఘాలు కూడా అక్టోబర్ 15 వ తేదీని గ్రామీణ మహిళా దినోత్సవం, మహిళా రైతుల దినోత్సవంగా జరుపుకుంటూ మహిళలు వ్యవసాయంలో పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఎలుగెత్తి చాటుతున్నాయి. వారి హక్కుల కోసం పోరాడుతున్నాయి.
ప్రత్యేకమైన చట్టం కావాలి
అయితే అక్టోబర్ 15 వ తేదీని మొక్కుబడిగా గ్రామీణ మహిళా దినోత్సవం, మహిళా రైతుల దినోత్సవంగా జరుపుకోవటం కాకుండా వారికి నిజమైన సాధికారత, గుర్తింపు కల్పించటానికి కృషి చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. మహిళా రైతులకు భూమి, అడవి, నీరు వంటి జీవనోపాధి వనరులపై హక్కులు కల్పించాలి. మహిళా రైతులు, కూలీలపై కుటుంబాలలోనూ, పనిచేసే చోట జరుగుతున్న వ్యవస్థీకృత హింస, వేధింపులను గుర్తించి నివారించే దిశగా కృషి చేయాలి. మహిళా వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అందే విధంగా, భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలకు వ్యవసాయ పధకాలు అందుబాటులోకి వచ్చే విధంగా, వారికి సామాజిక భద్రత పధకాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు కచ్చితమైన విధానపరమైన చర్యలు చేపట్టాలి.
ఎస్ ఆశాలత 9490119242






కామెంట్‌లు (0)