రెండు మూడు శతాబ్దాల కిందట గోండురాజుల రాజధానిగా ఉన్న సిర్పూర్ పట్టణానికి దగ్గరలో కొత్తపేటగా పిలువబడే ప్రాంతం ఉంది. ఏడాది పొడుగునా జీవనదిలా పారే పెద్దవాగు పరిశ్రమకు సమృద్ధిగా నీరు అందించేది. ఇక్కడ నైజాం నవాబు పేపర్ మిల్లు స్థాపించి దానికి సిర్పూర్ పేపర్ మిల్లు అని పేరు పెట్టి, ఊరి పేరును సిర్పూర్ కాగజ్ నగర్‌గా మార్చడం జరిగింది. మిల్లులో పనిచేయడానికి దేశం నలుమూలల నుండి కార్మికులు, కర్మచారులు చేరడంతో సిర్పూర్ కాగజ్ నగర్ భిన్న సంస్కృతులకు ఆలవాలంగా మారి, మినీ ఇండియాగా వ్యవహరింపబడేది. కాగజ్ నగర్‌కు వలస వచ్చి స్థిరపడిన వారందరూ తమ తమ సాంస్కృతిక కార్యక్రమాల కోసం సమాజాలను ఏర్పరచుకొని, వారి పండుగలు పబ్బాలు, నృత్య గాన నాటకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం సమాజాలను స్థాపించుకున్నారు.
అన్ని సాంస్కృతిక సంస్థల్లో కెల్లా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించింది, ఎక్కువ కాలం నిలబడింది లలిత కళా సమితి. రచయిత కాగజ్‌నగర్ సర్ సిల్క్ మిల్లు ఉద్యోగిగా వెళ్లిన కొన్ని నెలలకే సంస్థలో సభ్యత్వం తీసుకొని నాటకాల్లో పాత్రలు వేయడం మొదలుపెట్టారు. లలిత కళా సమితి ప్రదర్శించిన నాటకాలు, ఆ నాటకాలలో వేషాలు వేసిన నటుల గురించి వివరంగా తెలియజేశారు. వీటితోపాటు ఫ్రెండ్స్ క్లబ్ నాటకాలు, శారదా నాట్య కళామండలి, నటనాలయ, సర్ సిల్క్ ఎస్.పి.ఎం క్లబ్బులు, తెలుగు సాహితీ సదస్సు, అన్నమాచార్య అంతర్జాతీయ 601 జయంతి, శతగళ జాతీయ గీతాలాపన గురించి వివరించారు. అలాగే కాగజ్ నగర్ కవులు, కాగజ్ నగర్ సందర్శించిన సాహితీవేత్తలు, కాగజ్ నగర్ కళాభిమానుల గురించి కూడా పేర్కొనడం జరిగింది.
తెలుగు సాహితీ సదస్సు సాహిత్య కార్యక్రమాలకు ఏర్పడిన సంస్థ గనుక కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణ సభలు వంటివి గత పాతికేండ్లుగా నిర్వహిస్తున్నది. డాక్టర్ సామల సదాశివ పద్యకృతులన్నీ ‘సదాశివ కావ్యసుధ’గా ఆయన జీవిత విశేషాలు, పలువురు శిష్యులు, సహోద్యోగులు, బంధువుల అభిప్రాయాలతో ప్రథమ వర్ధంతి సందర్భంగా ‘సదాశివ స్మృతి సుధ’ను వెలువరించడమే గాక, ఆయన పేరుమీద ఏటేటా ఒక సాహితీవేత్తకు పురస్కారం అందజేస్తున్నారు. ఇలా కాగజ్ నగర్‌లో జరిగిన జరిపిన సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ వివరించడం జరిగింది. ఇందుకు సాక్ష్యంగా ఫొటోలను విస్తృతంగా ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. కాగజ్‌నగర్ సాంస్కృతిక చరిత్రను నమోదు చేసిన గ్రంథంగా ఇది నిలిచిపోతుంది.
కె పి అశోక్ కుమార్, 97000 00948






కామెంట్‌లు (0)