స్కూలు నుండి ఇంటికి వచ్చి, స్కూలు బ్యాగ్ విసురుగా సోఫాలో పడేసిన కొడుకుని కోపంగా చూసింది లక్ష్మి. రేపటి నుండి దసరా సెలవులు ఇచ్చారు! స్కూలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పైగా చదువుతున్నది మూడో తరగతి. అంత కోపం ఎందుకు వచ్చిందో తల్లికి అర్థం కాలేదు!
‘‘ఎందుకురా స్కూలు బ్యాగును అట్లా విసిరేశావ్! దసరా సెలవుల తర్వాత స్కూలుకి వెళ్ళవా?’’ అన్నది తల్లి కోపంగా.
‘‘నాకీ పేరు ఎందుకు పెట్టారు?’’ అడిగాడు కొడుకు ఇంకా కోపంగా.
‘‘నీ పేరు పెట్టింది నేను కాదు! మీ డాడీ! ఆయనొచ్చాక అడుగు!’’ అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి.
తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు కొడుకు. తల్లి తెచ్చిన మురుకులు కూడా ముట్టుకోలేదు. పాలు తెస్తే పక్కకి పెట్టాడు.
కాసేపటికి తండ్రి పుష్పకుమార్ వచ్చాడు. వెంటనే తండ్రికి ఎదురెళ్ళాడు కొడుకు.
‘‘డాడీ! నాకీ పేరు ఎందుకు పెట్టావు?’’ అడిగాడు తండ్రిని.
‘‘నీ పేరుకేం! చాలా గొప్ప పేరు! తెలివి తేటలకు మారుపేరురా నీ పేరు! జ్ఞానేష్ కుమార్! చూశావా, ఎంత గొప్పగా ఉందో!’’ అన్నాడు తండ్రి గర్వంగా.
‘‘నాకీ పేరు నచ్చలేదు! నేను పేరు మార్చుకుంటాను!’’ అన్నాడు కొడుకు.
‘‘ఏం ఎందుకు నచ్చలేదు! మార్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? " అసహనంగా అడిగాడు తండ్రి.
‘‘స్కూల్లో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు! జ్ఞానేష్ ఓట్ చోరీ! అంటూ ఎగతాళి చేస్తున్నారు!" అన్నాడు కొడుకు.
వంటింట్లోంచి చిన్నగా నవ్వు విన్పించింది!
‘‘నీ పేరుని వెక్కిరించటం దేశ ద్రోహం! వాళ్ళ మీద పోలీస్ కంప్లెంట్ ఇస్తాను! తీసికెళ్ళి బొక్కలో వేస్తారు! దెబ్బకి రోగం కుదురుతుంది!!" అన్నాడు తండ్రి.
‘‘ఇంతకూ నా పేరుని ఎందుకు వెక్కిరిస్తున్నారు! ఓట్ చోరీ అని ఎందుకంటున్నారు!’’ అడిగాడు కొడుకు.
‘‘నేను చెబుతాను!’’ అంటూ కాఫీ కప్పు తీసుకొచ్చి భర్తకు అందించింది లక్ష్మి.
‘‘ఏమిటీ నీవు చెప్పేది !’’ ఉక్రోశంగా అడిగాడు పుష్ప.
‘‘జ్ఞానేష్ అనే పేరు గల పెద్ద మనిషి ఈ దేశంలోని 13 కోట్ల ప్రజల ఓట్లను దొంగిలించాడు! అందుకే ఓట్ చోరీ అని వెక్కిరిస్తున్నారు! అన్నది లక్ష్మి.
ఓట్లను దొంగిలించి ఆయనేం చేసుకుంటాడు!" అమాయకంగా అడిగాడు కొడుకు.
‘‘అద్గది అదీ పాయింట్! ఓట్లు తీసేస్తే ఆయనకేం లాభం!’’ అడిగాడు తండ్రి.
‘‘మనం ప్రతి పనీ మనకే లాభం లేదా నష్టం కల్గించాల్సిన అవసరం లేదు! ఉదాహరణకు సరిహద్దుల్లో కాపాలకాసే జవానుకు పెద్దగా లాభం రాదు. కాని ప్రాణాలకు తెగించి చొరబాటుదార్లను అడ్డుకుంటాడు!" అంటున్న లక్ష్మి మాటలకు అడ్డు తగిలాడు పుష్ప.
‘‘శెహభాష్! సరిహద్దులో జవాను చేస్తున్న కృషినే దేశం లోపల జ్ఞానేష్ చేస్తున్నాడు! దేశంలో చొరబడిన వారిని, అక్రమంగా ఓట్లు సంపాదించిన వారినే ఆయన ఓటరు లిస్టు నుండి తొలగిస్తున్నాడు. ఆ విధంగా దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు!" అన్నాడు పుష్ప గర్వంగా.
‘‘తొందర పడకండి శ్రీవారు! ఈ దేశంలోని వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించటం, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించటం ఎన్నికల కమీషన్ బాధ్యతలు! అంతేకాని, దేశద్రోహులను, అక్రమ వలసదారులను గుర్తించటము, వారికి శిక్షలు విధించటమూ ఎన్నికల కమిషన్ పని కాదు! ఆ పని చేయటానికి హోంశాఖ ఉందికదా! " అన్నది లక్ష్మి.
‘‘అంటే అనర్హలకు ఓట్లు ఉంటే కళ్ళు మూసుకోవాలా?’’ కోపంగా అడిగాడు పుష్ప.
‘‘అనర్హులకు ఓట్లు కల్పించాలని ఎవరూ అనటం లేదు! కాని అర్హుల ఓట్లు తీసేస్తున్నారు! గోవాలో తొలగించిన 97 మంది ఓట్లను తిరిగి చేర్చాలని కోర్టు ఆదేశించినా, ఇంతవరకు ఎందుకు అమలుకావటం లేదు? స్థానిక ఎన్నికల అధికారి నిర్వహించాల్సిన ఓట్ల తొలగింపు అధికారం, ఢిల్లీకి ఎందుకు దఖలు పడింది! దీనికి కారణం ఎవరు? " అడిగింది లక్ష్మి.
"అదంతా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ! అనాడు పుష్ప.
"ముగ్గురున్న ఎన్నికల కమిషన్‌లో మిగిలిన ఇద్దరు, తమకు తెలియకుండా, ఫారం 6, ఇతర విధివిధానాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని 14 సార్లు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలిపారు కదా!" అన్నది లక్ష్మి.
‘‘చర్చల్లో అభ్యంతరాలు తెలపటం సహజం! కాని నిర్ణయాలు ఏకగ్రీవమే! అందుకే మొన్న ప్రెస్ మీట్లో అభ్యంతరాలు చెప్పలేదు కదా!" అన్నాడు పుష్ప బింకంగా.
చిన్నగా నవ్వింది లక్ష్మి.
‘‘ప్రెస్ మీట్లో మేము ఐక్యంగా లేము! అని చెప్పటానికి వాళ్ళేమి చిన్న పిల్లలు కాదు! సీనియర్ సివిల్ సర్వెంట్లు! అయితే ఆ ముగ్గురి తప్పిదాల వల్ల దేశంలోని సాధారణ ప్రజల ఓట్లు తొలగించబడుతున్నాయి! ఓట్లు తొలగించటం అప్రజాస్వామికమని, దేశద్రోహం కన్నా ఇదేమీ తక్కువ కాదని, న్యాయ నిపుణులు చెబుతున్నారు! తమకు పడవు అనుకున్న ఓట్లను ఎన్నికల కమిషన్ ద్వారా తొలగించేందుకు బిజెపి ప్రయతిస్తోందని, అందుకోసం విధివిధానాలను జ్ఞానేష్ కుమార్ ద్వారా మార్చుతున్నదని, అందరికీ తెలిసిపోయింది! అందుకే జ్ఞానేష్ కుమార్ దొంగ అనీ అందరూ అంటున్నారు!’’ అన్నది లక్ష్మి.
పుష్ప ఏదో చెప్పబోయి అటూ ఇటూ చూశాడు! కొడుకు కనబడలేదు! అటూ ఇటూ చూస్తుండగానే కొడుకు ఒక కాగితం పట్టుకొని వచ్చాడు! అది వాడి బర్త్ సర్టిఫికేట్!
‘‘ఆ ఓట్ల దొంగ పేరు నాకు పెట్టినందుకు డాడీతో కటీఫ్! ఇప్పటి నుండి నా పేరు మార్చుకుంటున్నాను! ఇక నుండీ ఇదే నా కొత్త పేరు! దీనికి వంక పెట్టేవారే లేరు!’’ అంటూ బర్త్ సర్టిఫికేట్‌లో కొత్త పేరు వాడే రాసుకున్నాడు!"
‘‘భగత్ సింగ్ !"
- ఉషా కిరణ్







కామెంట్‌లు (0)