10 నుంచి 12 వరకు అండర్ - 20 రాష్ట్రస్థాయి పోటీలు..
- 3 వేల మంది వరకు క్రీడాకారులు, అభిమానుల రాక
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేటలో మూడు రోజులపాటు కబడ్డీ క్రీడా హోరాహోరీకి తెరలేవనుంది. తెలంగాణ అండర్–20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఈ నెల 10 నుంచి 12 వరకు అశ్వారావుపేట వేదిక కానుండగా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది క్రీడాకారులు, క్రీడాభిమానులు తరలిరానున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కబడ్డీతో పాటు బతుకమ్మ సంబరం
దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న కబడ్డీ పోటీలు జరిగే వేదికపైనే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్రీడా పోటీలతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అండర్–20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు, బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, తాడేపల్లి రవి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు







కామెంట్‌లు (0)