- అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలి
- సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
- ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సత్తుపల్లి
అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లను మంజూరు చేయాలని, అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లిలో ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. స్థానిక నీలం రామచంద్రయ్య భవనం నుంచి కాకర్లపల్లి రోడ్డు, పాత సెంటర్, కల్పతరు రోడ్, రింగ్ సెంటర్ మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ... జిల్లాలో తీవ్రమవుతున్న విద్యుత్ కోతలు, విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పాలన సాగుతున్నా అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ సవరణ చట్టం పేరుతో మీటర్లు బిగించి ప్రజలపై అదనపు భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కరెంట్ కోతల వల్ల సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, కౌలు రైతులు పెట్టుబడులు రాక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు హామీలిచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తలసేమియా బాధితులు, అనాథలకు పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందన్నారు. అలాగే ఆకాశాన్నంటుతున్న ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు అర్ధాకలితో అలమటించే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడం మాని, ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, జిల్లా నాయకులు గంటా శ్రీనివాస్, బీరెల్లి లాజర్, అమర్లపూడి శరత్, డివిజన్ నాయకులు రాజు, వెంకటేష్, నాగిరెడ్డి, పుల్లారావు, మాల్యాద్రి, రాజారావు, నాగప్రసాద్, దేవి, అలివేలు, వెంకటమ్మ, నరసమ్మ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)