Magazines

కార్పొరేట్ల సేవలో తరిస్తున్న పాలకులు

2 గంటల క్రితం

cpiml mass line
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం


- తిరుగుబాటు ద్వారానే వ్యవస్థలో సమూల మార్పులు

- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు ధ్వజం 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​కార్మికవర్గ నాయకత్వంలో జరిగే ప్రజా తిరుగుబాటు ద్వారా మాత్రమే వ్యవస్థలో సమూల మార్పులు సాధ్యమవుతాయని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. హన్మేష్, కె. సూర్యం అభిప్రాయపడ్డారు. సోమవారం సత్తుపల్లిలో పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, కె. కల్పన  అధ్యక్షతన సోమవారం  నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ రెండో రోజు శిక్షణా తరగతుల్లో వారు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు. భారత విప్లవోద్యమానికి అవలంబించాల్సిన పంథా-కార్యక్రమం, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అంశాలపై టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యం, ఎం. హన్మేష్ మాట్లాడారు. సామ్రాజ్యవాదులతో జతకలిసిన భారత గుత్త పెట్టుబడిదారీ వర్గం దేశ సహజ వనరులతో పాటు రైతులు, కార్మికుల శ్రమను నిలువునా దోపిడీ చేస్తోందని వారు విమర్శించారు. ఫలితంగా దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


విద్య, వైద్యం సామాన్యులకు దూరమై నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందన్నారు. నేడు దేశంలో ఊపందుకుంటున్న జెన్ జీ ఉద్యమం యువతలోని తీవ్ర అసంతృప్తికి ప్రత్యక్ష అద్దం పడుతోందని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. పాలకులందరూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ వారి సేవలోనే తరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా హిందూ రాజ్య స్థాపన కోసం లౌకిక రాజ్యాంగ విలువలకు పాతరేస్తోందని ధ్వజమెత్తారు. అమెరికా సామ్రాజ్యవాదులతో వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ దేశ ప్రజలకు, రైతాంగానికి పాలకులు తీవ్ర ద్రోహం చేస్తున్నారన్నారు.


అమెరికా తన యుద్ధోన్మాదంతో లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాల నేతలను హత్యలు, కిడ్నాప్‌లు చేస్తూ ఆయా దేశాల వనరులను బహిరంగంగా దోపిడీ చేస్తోందని విమర్శించారు. సంపూర్ణ స్వాతంత్ర్యం, ప్రజస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కె. రమ, కెచ్చల రంగారెడ్డి, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, సీవై పుల్లయ్య, మనోహర్ రాజు, కూకలకుంట రవి, ఆవుల అశోక్, అమర్లపూడి రాము, గోకినేపల్లి లలిత, గంటా శ్రీను, అమర్లపూడి శరత్, కాటినేని శ్రీనివాసరావు, నాగ ప్రసాద్, గంటా వెంకట నరసమ్మ, తాటి రాజు, అలివేలు, తాటి దేవి, కృష్ణవేణి, వెంకటమ్మ  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్