వలస కార్మిక కుటుంబంలో పుట్టారు. జాతి వివక్ష మధ్య పెరిగి పోరాడుతూ ఎదిగారు. స్ర్తీలపై జరుగుతున్న లైంగిక దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించాలంటూ చారిత్రాత్మక తీర్పు ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాల పరిధి పెంచి బాధితుల స్వరంగా నిలిచారు. ప్రపంచ న్యాయ సూత్రాలకే వన్నె తెచ్చిన న్యాయ కోవిదురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రువాండా, శ్రీలంక, గాజాలకు వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. ఆమే భారతీయ మూలాలున్న నవనీతమ్ పిళ్లై. అటువంటి గొప్ప వ్యక్తికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణకు అందించిన విశేష సేవలకుగాను ఆమె ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానం నేటి మానవిలో...
నవనీతమ్ 1941 సెప్టెంబర్‌లో 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో పుట్టారు. తల్లి శాంతమ్మ, తండ్రి నారాయణ స్వామి నాయుడు. నవనీతమ్ పుట్టడానికి ముందే ఆమె తాతయ్య నిర్బంధ కూలీగా తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమె తండ్రి బస్ డ్రైవరు సహా అనేక వృత్తులు చేశారు. దారిద్ర్యం, వర్ణ వివక్ష వాతావరణంలో నవనీతమ్ పుట్టి పెరిగారు. ఆమెతో కలిపి మొత్తం 8 మంది పిల్లల పోషణ ఆ పేద కుటుంబానికి కష్టంగా ఉండేది. కానీ, నవనీతమ్ కష్టపడి చదువుకున్నారు. చదువుకి అంతగా ప్రాధాన్యం లేని ఆ రోజుల్లోనూ ఆమె తల్లిదండ్రులు విద్యే పిల్లలకు ఆస్తిగా భావించారు. ముఖ్యంగా శాంతమ్మ ఆడపిల్లలు కచ్చితంగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు.
మనుగడకై పోరాటం
ఐదేండ్ల వయసులో తండ్రికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటే కొందరు నవనీతమ్‌పై దాడి చేసి ఆ మొత్తాన్ని దోచుకున్నారు. నేరం రుజువైనా న్యాయస్థానం ఆ డబ్బును తిరిగి ఇప్పించలేదు. చిన్ననాటి ఆ సంఘటన తన మనసుపై బలంగా ముద్ర వేసింది. అప్పుడే మనుగడకోసం పోరాడాలన్న తత్వాన్ని తండ్రి ఆమెకు నూరిపోశారు. ఇవే న్యాయ వ్యవస్థపై ఆమెకు ఆసక్తిని పెంచాయి. స్థానిక భారతీయ కమ్యూనిటీ విరాళాలు, స్కాలర్‌షిప్ సాయంతో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎల్‌ఎల్‌బీ పట్టాలు అందుకున్నారు. అయితే 1959లో ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక విశ్వవిద్యాలయాల యాక్ట్ వల్ల ఆమె మరో యూనివర్సిటీకి మారాల్సి వచ్చింది. అయితే అక్కడ ఎల్‌ఎల్‌బీ కోర్సు లేదు. దాంతో మంత్రి కార్యాలయానికే ఫోన్ చేసి ప్రత్యేక మినహాయింపు సాధించుకున్నారు. ఆ పట్టుదలే నవనీతమ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
రాజకీయ ఖైదీలకు అండగా...
హార్వర్డ్ యూనివర్సిటీ నుండి లా పట్టా తీసుకొని దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చదువు పూర్తయ్యాక నవనీతమ్ అటార్నీగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కానీ లా ఫర్మ్‌లేవీ ఆమెను ఉద్యోగంలోకి తీసుకోలేదు. ‘తెల్లజాతి ఉద్యోగులు కలర్డ్ మహిళ కింద పనిచేయడం కుదరదు’ అని తెగేసి చెప్పారు. దాంతో నాటల్ ప్రావిన్స్‌లో సొంత సంస్థను ప్రారంభించారు. ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో శ్వేత ప్రభుత్వం అణచివేతకు గురవుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, బ్లాక్ కాన్షియస్‌నెస్ మూవ్‌మెంట్ వంటి సంస్థల నేతలు, రాజకీయాందోళనకారుల తరఫున ఉచితంగా వాదించారు. పోలీసులు పెట్టే చిత్రహింసలను, అక్రమ నిర్బంధాలను ప్రపంచం దృష్టికి తెచ్చారు. ఆమె భర్త పరంజ్యోతి ఆంథోనీ పిళ్లై అలియాస్ గ్యాబీ పిళ్లైను ‘టెర్రరిజం యాక్ట్’ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కోర్టును ఆశ్రయించి, అక్రమ విచారణ పద్ధతులను నిలువరించి భర్తను కాపాడుకున్నారు. రాబెన్ ద్వీపంలో నిర్బంధమైన నెల్సన్ మండేలా సహా ఇతర రాజకీయ ఖైదీలకు న్యాయవాదులను సంప్రదించే హక్కును సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషించారు.
న్యాయ గొంతుకగా
జాతి వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పోరాటాలకు న్యాయ గొంతుకగా మారారు. న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఆమె చేసిన పోరాటం వల్లే అక్కడి రాజకీయ ఖైదీలకు లభించింది. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారి కేసులను ఆమె వాదించారు. జాతీయ మహిళా సంకీర్ణ సమితి సభ్యురాలిగా, వివక్షను నిషేధిస్తూ, రాజ్యాంగంలో కొత్తగా సమానత్వ నిబంధనను పొందుపరచడంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష రద్దయిన తర్వాత 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నవనీతమ్ బాధ్యతలు తీసుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో 2008-14 వరకు న్యాయ సేవలు అందించారు. అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ (రువాండా వ్యవహారాలు) అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయవాదిగా, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం హై కమిషనర్‌గా కీలక మిషన్లలో భాగమయ్యారు.
లైంగిక దాడి కూడా యుద్ధమే
అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ (రువాండా వ్యవహారాలు)లో న్యాయమూర్తి నవనీతమ్‌తో కూడిన ధర్మాసనం అప్పట్లో ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ప్రభుత్వాధినేతలు తాము సాగించే మారణ హోమంలో లైంగిక దాడులు సైతం ఆయుధాలుగా వాడుకుంటున్నారని రువాండా మాజీ మేయర్ జీన్ పాల్ అకయెసు కేసులో ట్రైబ్యునల్ తేల్చింది. అంతర్జాతీయ యుద్ధ నేరాల జాబితాలో లైంగిక దాడిని కూడా చేర్చింది. 1994లో రువాండాలో సాగిన రక్తపాతం సందర్భంగా రెండువేల మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. ఈ నేరాలకు బాధ్యునిగా మాత్రమే కాకుండా, యుద్ధ నేరస్థుడిగాను అకయెసును ప్రకటించింది. కాగా, భారత మూలాలున్న సవనీతమ్ పిళ్లైను నోబెల్ శాంతి బహుమతి వరించడంపై అనేక మంది భారతీయ ప్రముఖులు అభినందించారు.
మానవ హక్కుల అధికారిగా
నవనీతమ్ ఐరాస మానవ హక్కుల ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ కాలంలో మహిళలు, ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం బహిరంగంగా గళమెత్తారు. వికీలీక్స్, ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి అంశాలపై వాక్‌స్వాతంత్య్రానికి మద్దతుగా నిలిచారు. శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలను నిర్మొహమాటంగా ప్రశ్నించారు. పాలస్తీనా, సిరియా వంటి చోట్ల జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వయసు పైబడుతున్నా ఆమె ఇప్పటికీ విశ్రాంతి కోరుకోవడం లేదు. అడ్‌హక్ న్యాయమూర్తిగా, అంతర్జాతీయ మరణశిక్ష వ్యతిరేక కమిషన్ అధ్యక్షురాలిగా, వివిధ స్వతంత్ర విచారణ కమిషన్లలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఈ విశేష కృషికిగానూ తాజాగా ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇది ఆమెకు దక్కిన గౌరవమే కాదు.. అణచివేతకు గురవుతున్న ప్రతి గొంతుకూ అందిన విజయం.






కామెంట్‌లు (0)