సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టు ఈ ఆందోళనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కా రాములు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిన యూబీ నైజాం ఎంప్లాయిస్ యూనియన్ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యూబి నైజాంలో సిఐటియు నేతృత్వంలో ఇటీవల మంచి వేతన ఒప్పందం జరిగిందని నెలకు రూపాయలు 11,500 నుండి 12,500 వరకు వేతనాలు పెరగడంతో పాటు వి డి ఏ , షిఫ్ట్ అలవెన్స్, సర్వీస్ అవార్డ్స్ వంటి అనేక సౌకర్యాలు సాధించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా సహకరించిన యాజమాన్యానికి ఐక్యంగా నిలిచిన కార్మికులకు ఆయన అభినందనలు తెలియజేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మిక వర్గానికి ఉపయోగకరంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానం లో నాలుగు లేబర్ కోడ్స్ తేవడం అంటేనే కార్మికులను ముంచి పెట్టుబడిదారులకు సేవచేయడం, పెట్టు బడిదారుల మెప్పు కోసమే లేబర్ కోడ్స్ తెచ్చారని అన్నారు. తక్షణమే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంపై కేవలం విమర్శలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అయిందని కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోందని ఇది సిగ్గు చేటని, అందుకే 25, 26న హైదరాబాద్ లో సిఐటియు ఆధ్వర్యంలో మహా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, యూనియన్ అధ్యక్షులు బాగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, ప్రేమ్ సాగర్ నరసింహారెడ్డి వివిధ యూనియన్ల నాయకులు రాందాసు, భీమ్ రెడ్డి, పరమేశ్వర్, సురేష్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)