- ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచడం సరికాదు
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి రూప్‌సింగ్
నవతెలంగాణ - కామారెడ్డి
ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) కామారెడ్డి జిల్లా కోశాధికారి రూప్‌సింగ్ అన్నారు. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించకపోగా, ఉన్న ఉపాధ్యాయులను కూడా ఇతర పాఠశాలలకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నప్పుడు, ఆ ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు పంపితే ఆ సబ్జెక్టును ఎవరు బోధిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం చావ రవి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి కామారెడ్డి జిల్లా నుంచి రూప్‌సింగ్ ప్రాతినిధ్యం వహించి ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి అందుబాటులో పాఠశాల ఉండటంతో పాటు నాణ్యమైన విద్య అందించాలన్నారు. నాణ్యమైన విద్య పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేయడం సమంజసం కాదన్నారు. నాణ్యత పేరుతో విద్యార్థులను విద్యకు దూరం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా అమలు చేసిన ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ పథకం ప్రకారం ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం అనేక పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని కోరారు. సర్వీసు నిబంధనలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి ఉన్నతస్థాయి పోస్టులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌లో మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
హెల్త్ కార్డుల జారీలో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన ఉద్యోగులందరికీ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తాత్కాలిక ఉపశమనంగా తీసుకొచ్చిన జీఓ 190ను అమలు చేయడం లేదన్నారు. 317 జీవో బాధితులందరికీ వెంటనే న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని, మెమో నంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరారు. విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపారీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్టీఎఫ్‌ఐ పిలుపు మేరకు అక్టోబర్ 17న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో సామూహిక నిరాహారదీక్ష నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర 7వ ద్వైవార్షిక మహాసభలను డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈలోగా అన్ని మండల, జిల్లా మహాసభలను పూర్తి చేయాలని రాష్ట్ర కమిటీ సూచించిందన్నారు.






కామెంట్‌లు (0)