Magazines

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

1 గంట క్రితం

employment work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా గ్రామీణ అధికారి విజయ లక్ష్మి

నవతెలంగాణ-కుభీర్‌
మండలంలో ఉపాధి హామీ పనులకు కూలీలు హాజరుకాకపోవడంపై జిల్లా గ్రామీణ అధికారి పీడీ విజయలక్ష్మి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రమైన కుభీర్ లోని ఉపాధి హామీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ నుంచి రోజుకు 100 మంది కూలీలు పనులకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీనియర్‌ మేట్‌ నుంచి ఎంపీడీవో వరకు చర్యలు తప్పవని హెచ్చరించారు.


గ్రామాల్లో నీటి కుంటల పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. సీనియర్‌ మేట్ల నియామకానికి ఆదేశాలు కుబీర్‌ మండలంలోని 42 గ్రామపంచాయతీల్లో ప్రతి 50 మంది కూలీలకు ఒక సీనియర్‌ మేట్‌ను సోమవారంలోగా నియమించాలని ఏపీడీ నాగవర్దన్‌ సూచించారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై అవగాహన ఉన్నవారికి మేట్‌లుగా అవకాశం కల్పించాలని సర్పంచులకు తెలిపారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు సంబంధించి తప్పనిసరిగా రెండు ఫొటోలు తీయాల్సి ఉంటుందని వివరించారు.


సీనియర్‌ మేట్ల నియామకంతో పనుల పర్యవేక్షణ మెరుగుపడటంతోపాటు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు. కూలీలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కూలీలకు పనులు కల్పించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో భూమారావు, ఉపాధి హామీ ఏపీఓ హరిలాల్,  పంచాయతీ కార్యదర్శులు ఉపాధి టెక్నిక్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్