ఒకే కంపెనీ.. ఒకే బ్యాచ్.. ఒకే ఎంఆర్పీ.. అయినా ధరల్లో తేడా!
ఏజెన్సీలకు ఓ రేటు.. మెడికల్ షాపులకు మరో రేటు?
పెద్ద వ్యాపారులకు రాయితీలు.. చిన్న దుకాణదారులకు ఇబ్బందులు..
జనరిక్ మందుల లభ్యత ఏదీ? ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలా?
ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ ఎక్కడ?..
నవతెలంగాణ–వేములవాడ
జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లాలి.. డాక్టర్ను సంప్రదించాలి.. మందులు కొనాలి! కానీ రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి ఈ వైద్య ఖర్చులే భారంగా మారితే పరిస్థితి ఏమిటి..? జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బులతో మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్తే.. అక్కడి ధరలు సామాన్యుడికి గుండె గుబేల్ మనేలా చేస్తున్నాయా? ఒకే కంపెనీ.. ఒకే బ్యాచ్.. ఒకే ఎంఆర్పీ ఉన్న ఇంజక్షన్లాకు, ఆంటీబయాటిక్స్ ఏజెన్సీల వద్ద వేర్వేరు కొనుగోలు ధరలు ఉండటమే ఇందుకు నిదర్శనమా? మరోవైపు జనరిక్ మందుల లభ్యతపై సందేహాలు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మెడికల్ మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు.. పెరుగుతున్న మెడికల్ షాపులపై తనిఖీలు జరుగుతున్నాయా? లేదా? అన్న ప్రశ్నలు! వెరసి వేములవాడలో మందుల వ్యాపారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడిన మందుల వ్యాపారంలో లాభాలకే పెద్దపీటనా? సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా?
ఒకే ఇంజక్షన్.. రెండు ధరలు!
వేములవాడ పట్టణంలో ఓ కంపెనీకి చెందిన యాంటీబయోటిక్ ఇంజక్షన్ కొనుగోలులో ధరల వ్యత్యాసం వెలుగులోకి వచ్చినట్లు ఓ మెడికల్ షాపు యజమాని తెలిపారు. మొదట ఒక ఏజెన్సీ నుంచి రెండు ఇంజక్షన్లు కొనుగోలు చేసిన ఆయనకు ధరపై అనుమానం వచ్చింది. దీంతో అదే ఉత్పత్తిని మరో ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసి పరిశీలించారు. రెండింటి బ్యాచ్ నంబర్, ఎంఆర్పీ ఒకటే ఉన్నప్పటికీ బిల్లుల్లో కొనుగోలు ధరలు వేర్వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఒకే మందుకు రెండు ధరలు ఎందుకు? కంపెనీ విక్రయ విధానమే కారణమా? ఏజెన్సీల మధ్య రాయితీల వ్యత్యాసమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై వివరణ కోరగా, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారికి కంపెనీలు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నాయని స్టాకిస్టులు తెలిపినట్లు సమాచారం. అయితే ధరల వ్యత్యాసానికి అసలు కారణమేంటో సంబంధిత అధికారులు పరిశీలిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జనరిక్ మందులు ఎక్కడ?
తక్కువ ధరకు లభించాల్సిన జనరిక్ మందులు పట్టణంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఖరీదైన మందులపైనే ఆధారపడాల్సి వస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో 10 నుంచి 30నుంచి 50 శాతం వరకు రాయితీలు ఇస్తున్నట్లు చెబుతున్నా.. ఆ రాయితీల వెనుక ఉన్న లెక్కలేమిటి? ఒకే మందుకు మెడికల్ దుకాణాల మధ్య ధరల్లో తేడాలు ఎందుకు వస్తున్నాయి? జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటున్నారు. మందుల ధరలు, రాయితీలు, కొనుగోలు బిల్లులపై పారదర్శకత ఉంటేనే వినియోగదారులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలా?
చిన్నపాటి జబ్బు చేసినా కొందరు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి తమ సమస్యను చెప్పి మందులు తీసుకుంటున్నారు. కొన్ని దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ వంటి మందుల విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా? అర్హత కలిగిన ఫార్మసిస్టులు అందుబాటులో ఉంటున్నారా? మందుల నిల్వ, గడువు తేదీలు, బిల్లుల జారీపై పర్యవేక్షణ ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయినప్పటికీ ఇలాంటి విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
గల్లీకో మెడికల్ షాపు.. తనిఖీలు ఎక్కడ?
వేములవాడ పట్టణంలో రోజురోజుకూ మెడికల్ షాపులు పెరుగుతున్నప్పటికీ, వాటి నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. షాపుల సంఖ్య పెరుగుతున్నప్పుడు తనిఖీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయా? నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహిస్తున్నారా? మందుల విక్రయాలపై ఫిర్యాదులు వస్తే అధికారులు స్పందిస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పట్టణంలో మెడికల్ ఫార్మసీలపై తనిఖీలు నిర్వహించినట్లు తమకు కనిపించడం లేదని కొందరు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే తనిఖీలు జరగలేదనే విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
పెద్ద వ్యాపారులకు రాయితీలు.. చిన్నవారికి కష్టాలు!
పెద్ద మొత్తంలో మందులు కొనుగోలు చేసే వ్యాపారులకు అధిక రాయితీలు లభిస్తుండగా, తక్కువ మొత్తంలో కొనుగోలు చేసే చిన్న మెడికల్ షాపులకు అదే స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెద్ద దుకాణాలతో ధరల విషయంలో పోటీ పడలేక చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. కంపెనీలు, స్టాకిస్టులు అనుసరిస్తున్న రాయితీల విధానంలో పారదర్శకత ఉందా? కొనుగోలు పరిమాణాన్ని బట్టి ధరలు మారుతున్నప్పుడు ఆ వివరాలు బిల్లుల్లో స్పష్టంగా ఉంటున్నాయా? అనే అంశాలపై స్పష్టత అవసరం. ధరల వ్యత్యాసానికి సంబంధించిన ఆరోపణలను నిర్ధారించేందుకు సంబంధిత బిల్లులు, సరఫరా వివరాలను పరిశీలించాల్సి ఉంది.
చివరకు నష్టపోయేది సామాన్యుడేనా?
మందుల కొనుగోలు ధరల్లో వ్యత్యాసాలు, జనరిక్ మందుల లభ్యతలో ఇబ్బందులు కొనసాగితే వాటి ప్రభావం చివరకు రోగులపై పడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం అదనపు భారంగా మారుతోంది. మందుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబాల గతి ఏమిటి? వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది? నాణ్యమైన మందులు సరసమైన ధరలకు లభించేలా వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఔషధ నియంత్రణ శాఖ స్పందించేనా?
ఒకే ఉత్పత్తికి వేర్వేరు కొనుగోలు ధరలు ఉండటానికి కారణాలేమిటో పరిశీలించాలని, మెడికల్ షాపుల్లో, మెడికల్ ఫార్మసీలో నిబంధనల అమలును తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. జనరిక్ మందుల లభ్యత, ప్రిస్క్రిప్షన్ ఆధారిత మందుల విక్రయాలు, బిల్లుల జారీ, నిల్వ ప్రమాణాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వినియోగదారుల కు సరసమైన ధరలకు, నాణ్యమైన మెడిసిన్ అందేలా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందిస్తారా? ధరల వ్యత్యాసంపై వాస్తవాలను బయటపెడతారా? నిబంధనల ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.
ప్రజారోగ్యమే ముఖ్యం.. లాభాలే పరమావధి కాకూడదు!
మందులు ఇతర వస్తువుల్లా కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితమైనవి కావు.. అవి ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. అందుకే మందుల విక్రయాల్లో పారదర్శకత, నాణ్యత, సరసమైన ధరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వ్యాపార విధానాలపై స్పష్టత ఉండాలి. ప్రజలకు జనరిక్ మందులు అందుబాటులోకి తేవడంతో పాటు, నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. రోగి జబ్బును ఆసరాగా చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారనే అనుమానాలకు తావులేకుండా వ్యవస్థ పనిచేయాలి. సామాన్యుడికి మందు అందాలి.. భరోసా కలగాలి.. అదే ప్రజారోగ్య వ్యవస్థ లక్ష్యం కావాలి.






కామెంట్లు (0)