Magazines

బాసరలో భక్తుల రద్దీ..   

1 గంట క్రితం

Basara
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

మూల నక్షత్రం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు

నవతెలంగాణ - ముధోల్ 

నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం మూల నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలకు విద్యాబుద్ధులు, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బాసరకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.


మూల నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ పిల్లలు విద్యలో రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, అక్షరాభ్యాస మండపాల వద్ద భక్తుల సందడి కనిపించింది. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.మూల నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తుల రాక పెరగడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్ల నిర్వహణ, ఆలయ పరిసరాల్లో రద్దీ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.మూల నక్షత్రం సందర్భంగా భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆలయ పరిసరాలు, గోదావరి ఘాట్లు, అక్షరాభ్యాస మండపాల వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు సిబ్బంది రద్దీని నియంత్రిస్తూ భక్తులకు సహకరించారు. బాసరాలయాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.


పలివెరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ముధోల్ ఎమ్మెల్యే ఓవర్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించి పలు వివరాలను ఆలయ ఈవో అంజనాదేవిని అడిగి తెలుసుకున్నారు.మూల నక్షత్రం సందర్భంగా బాసర క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారుల అక్షరాభ్యాసాలు, అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలతో క్షేత్రం సందడిగా మారింది. విద్యారంభానికి బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలనే నమ్మకంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ పిల్లలకు అక్షర శ్రీకారం చుట్టించారు. మూల నక్షత్రం పర్వదినం బాసరలో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగగా, అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోయింది.

Basara

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్