- ఎస్ఐ వి. నవీన్
నవతెలంగాణ - తొగుట
సైబర్ నేరగాళ్లు మోసపూరిత విధానాల అను సరిస్తున్నారని ఎస్ఐ వి. నవీన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొగుట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వి. నవీన్ మాట్లాడుతూ .. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత విధానాల గురించి విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, నకిలీ లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ స్కామ్స్, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అపరిచితు లకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చెప్పవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'గోల్డెన్ అవర్' లోపు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా, మోసగాళ్ల ఖాతాల్లోని డబ్బు ను ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో దాదాపు 80 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు, సమాజానికి ఎంతో ఉపయోగకరమైన ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తొగుట పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





కామెంట్లు (0)