- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- రూ. 2 కోట్లతో ఇండోర్ స్టేడియానికి మంత్రి శంకుస్థాపన
నవతెలంగాణ-సత్తుపల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని, అందులో భాగంగా క్రీడలకు కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సత్తుపల్లి వచ్చిన మంత్రి పొంగులేటి సత్తుపల్లి పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. క్రీడా రంగం కూడా ఎక్కడా కుంటుపడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చామన్నారు. స్పోర్ట్స్ సిటీలో ఒక అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీపడుతుందన్నారు. ప్రపంచ దేశాలలోని ఇతర దేశాలకు కూడా మన రాష్ట్రం పోటీగా నిలుస్తుందన్నారు. క్రీడలపై ఆసక్తి చూపే యువతీ, యువకులను ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. కేవలం క్రీడలే కాకుండా విద్య, వైద్య రంగాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలను తగ్గించేదేలేదన్నారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)