ప్రస్తుత రబీలో 7,350వేలఎకరాల్లోనే పంటలు
గత యాసంగిలో 14,700ఎకరాల్లో సాగు
సగానికి పైగా పడిపోనున్న వరి విస్తీర్ణం
నవతెలంగాణ-మల్హర్ రావు
ఎల్‌నినో ప్రభావంతో సాగు ప్రణాళిల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.సాధారణంగా వరికే అధిక ప్రాధాన్యతనిచ్చే రైతులు ఈసారి నీటి వనరుల పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మండలంలో చెరువులు,కుంటలు,వాగులు,బోరు బావులు,చిన్నతరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో గత రబీ సాగుతో పోలిస్తే ప్రస్తుత రబీ సాగు సగానికి పడిపోయింది.

ప్రణాళికలో మార్పులు..
గత యాసంగిలో మండల వ్యాప్తంగా 14,700ఎకరాల్లో పంటలు సాగుచేయగా...ప్రస్తుత సీజన్లో 7,350ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.గతేడాదితో పోల్చితే ఈసారి 7వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గేలే కనిపిస్తుంది.గతేడాది 14600ఎకరాల్లో వరి,100ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు.ఈయేడు యాసంగిలో మొత్తం 7,350ఎకరాల్లో సాగు కాగా ఇందులో 5వేల ఎకరాల్లో వరి,1000ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తుండగా 350ఎకరాల్లో ఆరుతడి కుసుమ పంటలు సాగుచేస్తున్నారని వ్యవసాయాధికారుల అంచనాలు చెబుతున్నాయి.
వరిసాగుకు నీటి గండం..
మండలంలో వానాకాలం లోటు వర్షపాతం,దీర్ఘకాలిక పొడి వాతావరణం కారణంగా పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావితం చూపింది.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని యాసంగిలో వరిసాగుపై రెండింతలు తగ్గనుంది.గత యాసంగిలో 14,600ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రస్తుత సీజన్‌లో 5వేల ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయాధికారులు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరుతడి పంటల సాగుపై ప్రచారం..
యాసంగిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే మండలంలో సాగునీటి వనరుల్లో ఆశించిన మేరకు నీరు లేకపోవడంతోపాటు గ్రామాల్లోని చెరువు లు,కుంటలు ఆశించిన మేరకు వర్షాలు లేక వెలవెలబోతున్నాయి.గతేడాది మండల వ్యాప్తంగా ఆరుతడి పంటలు వెయ్యి ఎకరాల్లో సాగుచేస్తే ఈ యాసంగిలో 7,350ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.పప్పు దినుసులు 20ఎకరాలు,నూనెగింజల పంటలు 30వేల ఎకరాలు,కూరగాయలు 100ఎకరాలు,ఆయిల్పామ్ 100ఎకరాలు,ఇతర పంటలు 10ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవాలి :శ్రీజ,మండల వ్యవసాయాధికారి
ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగుచేసు కోవాలి.వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.ఆరుతడి పంటల సాగులో మల్చింగ్,సూక్ష్మ సేద్యం వంటి పరికరాలను వినియో గించుకోవాలి.పంటల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.





కామెంట్‌లు (0)