Magazines

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి 

1 గంట క్రితం

Government schools
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

- టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్

నవతెలంగాణ-సత్తుపల్లి 

అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అన్నారు. సంఘ సీనియర్ కార్యకర్త బేతిని నరసింహారావు ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి  ఉమామహేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆదివారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంజాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాట్లాడుతూ... విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికీ పాఠశాలలు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.


నాణ్యత పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ అందరికీ విద్యను దూరం చేయడం సరికాదన్నారు. కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధనను పక్కనబెట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చడం, జాతీయ విద్యా విధానం పేరుతో పాఠశాలలను కుదించడాన్నిశ ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటును స్వాగతిస్తామని, అయితే ఆ పేరుతో ఉన్న పాఠశాలలను మూసివేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలలకు మరణశాసనంగా మారిన జీవో నెం. 25ను వెంటనే సవరించాలని రంజాన్ డిమాండ్ చేశారు.‌ ​ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లను, 50 మందికి పైగా విద్యార్థులున్న చోట తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. 


​ప్రధానోపాధ్యాయులపై ఉన్న యాప్‌ల భారాన్ని, బోధనేతర పనుల ఒత్తిడిని తొలగించాలన్నారు. 

​అన్ని జిల్లాలకు, మండలాలకు విద్యాధికారుల ఎంఈఓ, డీఈఓ పోస్టులను మంజూరు చేసి తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ​సర్వీస్ నిబంధనల సమస్యలను పరిష్కరించి, ఉన్నత స్థాయి పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. 2023, జులై 1 నుంచి అమలు కావాలసిన పీఆర్సీ నివేదికను తెప్పించుకుని తక్షణమే వర్తింపజేయాలని కోరారు. పీఆర్సీపై నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌లో పోరాటానికి సిద్ధం కావాలని రంజాన్ ఉపాధ్యాయులకు  పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో హెల్త్ కార్డులపై నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ​జీవో నెం. 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు జీవో నెం.190ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.


సీపీఎస్ ను రద్దు చేసి  మెమో నెం. 57 ప్రకారం 2003, డీఎస్‌సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.‌ కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, మోడల్ స్కూళ్లను ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని 010 పద్దు కింద వేతనాలు అందించాలని కోరారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల టైమ్‌టేబుల్‌ను సవరించాలని, ​తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని రంజాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు వీవీ  రామరావు, కె. నిర్మల కుమారి, కాంప్లెక్స్ హెచ్‌ఎం నాగేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం, వివిధ మండలాల ఉపాధ్యాయులు, సంఘ  యూనియన్ నాయకులు, జిల్లా ఎడిటర్ కె. వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా కార్యదర్శులు జల్లిపల్లి మురళీమోహన్, గనిపిశెట్టి రమేష్, భద్రాద్రి జిల్లా కార్యదర్శి మట్టపర్తి రాజేశ్వరరావు, టాప్రా జిల్లా బాధ్యులు కళ్యాణం  నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు, ఆల్ పెన్షనర్స్ సంఘం సత్తుపల్లి బాధ్యులు కేశవరెడ్డి, సత్తుపల్లి, వేంసూరు ఎంఈఓలు నక్కా రాజేశ్వరరావు, చలంచర్ల వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్