Magazines

కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి: ఏఐటీయూసీ నేత వి.ఎస్. బోస్‌

2 గంటల క్రితం

Workers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం

నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు చేపట్టిన 3వ రోజు సమ్మె శనివారం రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వి.ఎస్. బోస్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు చెల్లించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈఎస్ఐ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం కార్మికులకు తీవ్ర అన్యాయమని అన్నారు.


జీతాల సమస్యపై గతంలోనే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశామని, ఈ నెల 13న గంటపాటు నిరసన ధర్నా నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అక్టోబర్ 19లోగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంట్రాక్టర్లు మాట తప్పారని మండిపడ్డారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు యు. హైమావతి, కార్యదర్శి సి.హెచ్. మాధవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తోకల సత్యప్రసాద్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుకుమార్ సంఘీభావం తెలిపారు.


ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాస్కరాచారి, నర్సింగ్ రావు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకురాలు మహాలక్ష్మి, ప్రమీల, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వేణుమాధవ్, నిరంకారి, నీలిమ, నర్సింహా, రాజేష్, రాజకుమార్ చారి, అశోక్, సమద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్