Magazines

అమీన్ పూర్ పెద్ద చెరువు కట్టపై కన్నులపండువగా సద్దుల బతుకమ్మ

2 గంటల క్రితం

Ameenpur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో కోలాహలంగా ముగింపు వేడుకలు
‎బతుకమ్మలతో భారీగా తరలివచ్చిన అమీన్పూర్ మహిళలు, ప్రజలు
‎సింగర్స్ ఆటపాటలు, చిన్నారుల నృత్యాలతో సందడి
‎దసరా ఉత్సవాలకూ అన్ని ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ - అమీన్ పూర్
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగాయి. అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పండుగ మహోత్సవానికి అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల నుండి మహిళలు, ప్రజలు రంగురంగుల బతుకమ్మలతో వేలాదిగా తరలివచ్చారు. గత 16-17 సంవత్సరాలుగా తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఈ బతుకమ్మ ఉత్సవాలను ఒక సాంప్రదాయంగా, ఎంతో ప్రాశస్త్యంతో నిర్వహించడం విశేషం.


ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు ప్రముఖ సింగర్లు తమ ఆటపాటలతో మహిళలను విశేషంగా ఆకట్టుకున్నారు. వారి పాటలకు అనుగుణంగా మహిళలు కోలాటాలు, బతుకమ్మ ఆటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అమీన్పూర్ పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.

‎అమీన్పూర్ ప్రజలకు సదా రుణపడి ఉంటా: తుమ్మల పాండురంగారెడ్డి
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ... "గత కొద్ది సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున, దిగ్విజయంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన అమీన్పూర్ ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ప్రజల ఆదరాభిమానాలు, ప్రోత్సాహమే నన్ను నిరంతరం ప్రజాసేవలో ఉంచుతున్నాయి" అని పేర్కొన్నారు. ఈనెల 20న జరగబోయే దసరా ఉత్సవాలను కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు.


వాహనదారులకు, భక్తులకు ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డికి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడపడుచులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.


దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు భాశెట్టి కృష్ణ, పట్లోళ్ల కల్పన ఉపేందర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు తలారి రాములు, మాజీ కౌన్సిలర్ కొల్లూరు గోపాల్, స్థానిక నాయకులు యాదగిరి నరసింహ, టిపిఆర్ యువ నాయకులు తుమ్మల రూష్యంత్ రెడ్డి, టిపిఆర్ అభిమానులు, ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్