Magazines

ఇందిరమ్మ కుటుంబ బీమాకు శ్రీకారం!

5 గంటల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం

- ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

- గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక శిబిరాలు

- ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా ప్రయోజనం

- 18 - 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే సభ్యులకు అవకాశం

- నమోదు,నామినేషన్‌ కు విధివిధానాలు ఖరారు

నవతెలంగాణ - అశ్వారావుపేట


ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాల పేర్లు, అమలు విధానాలు మారుతున్నాయి.అయితే పథకాల పేర్ల మార్పు కంటే వాటి ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు ఎంతమేర చేరుతున్నాయన్నదే కీలకం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న రైతు బీమా పథకానికి బదులుగా కుటుంబ ఆర్థిక భద్రతే లక్ష్యంగా ఐకేజేబీపీ ('ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం') అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల వారీగా, పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కుటుంబాల నమోదు చేపట్టనుంది.

రూ.5 లక్షల బీమా కవరేజీ:Indiramma Family Insurance

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్ఈఈఈపీసీ సర్వేలో గుర్తించిన సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు బీమా ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం ప్రతిపాదించింది. నమోదు సమయంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుటుంబ సంపాదించే సభ్యుడు ఈ పథకానికి అర్హుడు. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్ధారించనున్నారు. పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. ఒకసారి నమోదు చేసుకున్న వారికి కనీసం ఏడాది పాటు బీమా కవరేజీ కొనసాగుతుంది.

పంచాయతీల వారీగా శిబిరాలు:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో నిర్దేశించిన వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో శిబిరాల నిర్వహణ, సిబ్బంది నియామకం, దరఖాస్తుల స్వీకరణ, వివరాల ధ్రువీకరణ తదితర ప్రక్రియలు చేపట్టనున్నారు. ప్రతి శిబిరానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తారు. ప్రతి నాలుగు శిబిరాలకు ఒక సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్ప్‌డెస్క్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.

ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి:

దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, అందుబాటులో ఉంటే రేషన్ కార్డు, మొబైల్ నంబర్‌తో పాటు కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను సమర్పించాలి. రేషన్ కార్డు ఆధారంగా ముందస్తుగా రూపొందించిన దరఖాస్తులను శిబిరాల్లో అందుబాటులో ఉంచుతారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ప్రత్యేక దరఖాస్తు ఫారాలు అందిస్తారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు కూడా సమీపంలోని శిబిరాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

నామినీ ఎంపికలో స్పష్టత అవసరం:

ఈ పథకంలో కుటుంబం నుంచి బీమా పొందే సభ్యుడిని, నామినీని కుటుంబమే నిర్ణయించుకోవచ్చు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే రూ.5 లక్షల బీమా మొత్తంలో ఎవరికెంత వాటా దక్కాలనే విషయాన్ని దరఖాస్తులో స్పష్టంగా నమోదు చేయాలి. బీమా పొందే వ్యక్తి సంతకంతో దరఖాస్తును సమర్పించాలి. నామినీల పేర్లు, సంబంధాలు, ఆధార్, మొబైల్ నంబర్లు, వాటాల వివరాలను అధికారులు పరిశీలిస్తారు.

రెండు వారాల్లో నమోదు పూర్తి చేయాలి:

శిబిరాల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, స్కాన్ చేసి డిజిటల్ రికార్డులుగా భద్రపరచనున్నారు. అసలు దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయాల పరిధిలో భద్రపరుస్తారు. శిబిరాల్లో దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రారంభమైన తేదీ నుంచి రెండు వారాల్లోగా కుటుంబాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాల వారికి ప్రత్యేక సహాయం అందించనున్నారు. దరఖాస్తుల్లో తప్పులు, వివరాల అసమతుల్యతలు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు హెల్ప్‌డెస్క్ ద్వారా మార్గనిర్దేశం చేయాలి. ఏ కుటుంబాన్నీ సరైన సమాచారం ఇవ్వకుండా వెనక్కి పంపకూడదని స్పష్టం చేశారు.

జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ:

జిల్లా కలెక్టర్లు శిబిరాల నిర్వహణ, నమోదుల పురోగతి, పెండింగ్ దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలను రోజువారీగా సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌డెస్క్, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల తేదీలు, ప్రదేశాలు, తీసుకురావాల్సిన పత్రాలపై ముందస్తుగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు.పథకం లక్ష్యం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబం నమోదు కావడం, బీమా ప్రయోజనం సకాలంలో అందడం, క్లెయిమ్ ప్రక్రియ పారదర్శకంగా సాగడం ద్వారానే ఈ పథకం లక్ష్యం నెరవేరనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్