Magazines

ఇందిరమ్మ కుటుంబ బీమా పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలి

1 గంట క్రితం

Indiramma's family insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆరోగ్యశ్రీలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్యం అందించాలి

- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్

నవతెలంగాణ-సత్తుపల్లి 

​రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ పథకం కింద అందించే పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీనివాస్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వానికి పలు డిమాండ్లను వ్యక్తం చేశారు.


పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోతోందన్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అప్పుల భారం వంటి సమస్యలతో సతమతమయ్యే బాధిత కుటుంబాలు తిరిగి నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం ఉండాలని పేర్కొన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకంలో ప్యాకేజీలు, వ్యాధుల పరిమితుల పేరుతో పేదలకు వైద్యాన్ని నిరాకరించే పరిస్థితులకు స్వస్తి పలకాలని కోరారు. అనారోగ్యం బారిన పడిన పేదలు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం అనేది సంపన్నులకే పరిమితమైన హక్కు కాదని, అన్ని రకాల వ్యాధులు, శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందేలా చర్యలు తీసుకోవాలని జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్