- సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ నాయకుడు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ
నవతెలంగాణ-సత్తుపల్లి
స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సమాజంలో కులవివక్ష పోవడం లేదని ఎమ్మార్పీఎస్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ వాపోయారు. శుక్రవారం సత్తుపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పండుగల వేళ దళితులపై వివక్ష రెట్టింపు కావడం విచారకరమన్నారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ జరుపుకునే హక్కు, ఆత్మగౌరవం దళితులకు లేదా అని ప్రశ్నించారు.
ములుగు జిల్లా నరసాపూర్ గ్రామంలో మహిళా సర్పంచ్ మడిపల్లి రాజేశ్వరిని బతుకమ్మ వేడుకల్లో కులం పేరుతో దూషించిన సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేపాక గ్రామంలో దళిత మహిళలు బతుకమ్మ పేర్చగా, వేరే సామాజిక వర్గం వారు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోటపాడులో దళితులు బతుకమ్మ ఆడకుండా పసుపు నీళ్లు చల్లి అవమానించిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైరా మండలం సిరిపురం గ్రామంలోనూ, పక్క రాష్ట్రమైన గుజరాత్‌లో గార్బా నృత్యంలోనూ దళితులపై ఇటువంటి వివక్షే జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వాలు తక్షణమే స్పందించి భవిష్యత్తులో దళితులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ పండుగలు స్వేచ్ఛగా, గౌరవంగా జరుపుకునే వాతావరణం కల్పించాలని కోరారు. బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, అది సమానత్వం, సోదరభావం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలో బతుకమ్మ అందరిదైనప్పుడు, ఆ వేడుకల్లో దళితులకు కూడా సమాన గౌరవం, హక్కులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్ మాదిగ, నాయకులు వెంకటేశ్వరరావు, కృష్ణయ్య, బాబురావు, మహేష్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)