Magazines

గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా ఓటును ఎన్‌రోల్‌మెంట్ చేయించుకోవాలి

1 గంట క్రితం

Graduates
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

- ఇండిపెండెంట్ కాంటెస్టెంట్ బ్రదర్ షఫీ

నవతెలంగాణ-సత్తుపల్లి 

​​ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 2027, మార్చి నెలలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ ఓటును ఎన్‌రోల్‌మెంట్ చేయించుకోవాలని ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ‌ చేయనున్న షేక్ షఫీవుల్లా (బ్రదర్ షఫీ) తెలిపారు. శుక్రవారం సత్తుపల్లి వచ్చిన బ్రదర్ షఫీ విలేకరులతో మాట్లాడారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు ప్రసాదించిన అమూల్యమైన హక్కు అని, మన భవిష్యత్తును సరిదిద్దుకోవడానికి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఓటు నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యతగా భావించాలన్నారు.


ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాలో సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు గ్రాడ్యుయేట్స్ ఉండే అవకాశం ఉందన్నారు. కానీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 4.5 లక్షల మంది పట్టభద్రులు మాత్రమే తమ ఓటును ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారన్నారు. ఈ లెక్కన 20 శాతం మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా 80 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోకపోవడం విచారకరమన్నారు.  చాలామందికి దీనిపై సరైన అవగాహన లేకపోవడం, తెలిసినవారు కూడా మనకెందుకులే అనే నిర్లక్ష్యంతో ఉండటమే ఇందుకు కారణంగా బ్రదర్ షఫీ చెప్పుకొచ్చారు. 

​మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను 

రాబోయే ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు బ్రదర్ షఫీ తెలిపారు. ​సమాజంలో మార్పు రావాలంటే విద్యావంతులైన పట్టభద్రులే ముందడుగు వేయాలన్నారు. మార్పు రాదు అనే నిరాశావాదాన్ని వీడి, ఆశతో అడుగు ముందుకు వేస్తేనే మార్పు సాధ్యమవుతుందని బ్రదర్ షఫీ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ, మోటివేషనల్ స్పీకర్ గా,  బ్రదర్ షఫీగా ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


మనం ప్రయత్నించకుండా వెనకడుగు వేస్తే మార్పు ఎప్పటికీ రాదని, అందుకే విద్యావంతుల గొంతుకగా నిలవడానికి ఈ ఎన్నికల బరిలో నిలిచానన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కాకుండా ఓటు నమోదుపైనే ప్రస్తుతం  దృష్టి సారించినట్లు బ్రదర్ షఫీ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నవంబర్ 6 లోగా నమోదు చేసుకోవాలని కోరారు. ​ఎవరికి ఓటు వేయాలో ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని, కానీ ప్రస్తుతం మన ప్రధాన దృష్టి అంతా ఓటు నమోదుపైనే ఉండాలన్నారు. ఓటు హక్కు లేకపోతే మన అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉండదని,  పట్టభద్రులందరూ నవంబర్ 6వ తేదీ లోపు తప్పకుండా తమ ఓటును ఎన్‌రోల్‌ చేసుకోవాలని కోరారు. మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, తోటి పట్టభద్రులకు ఈ విషయం తెలియజేసి వారి చేత కూడా ఓటు ఎన్‌రోల్‌ చేయించాలన్నారు.  అందరం కలిసికట్టుగా ప్రయత్నించి నూటికి నూరు శాతం నమోదు సాధిద్దామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ కాంటెస్టెంట్ బ్రదర్ షఫీ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్