- 23న రెండో విడత మాప్అప్ కౌన్సెలింగ్, వాక్ఇన్ అడ్మిషన్లు
- టీజీ ఈఏపీసీఈటీ అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు అవకాశం
- అన్ని కేటగిరీల అభ్యర్థులు హాజరుకావచ్చు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఉద్యాన విద్యలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు అశ్వారావుపేట ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో 2026 - 27 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) ఉద్యాన విద్య డిగ్రీ కోర్సులో రెగ్యులర్ కోటా కింద మిగిలిన ఖాళీల భర్తీకి ఈనెల 23న రెండో విడత మాప్అప్ కౌన్సెలింగ్, వాక్ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీజీ ఈఏపీసీఈటీ - 2026 లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు కూడా అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ తదితర అన్ని కేటగిరీలకు చెందిన రైతు, రైతేతర కోటా అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వివరించారు. విశ్వవిద్యాలయ నిబంధనలు, అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ విధానం, ఆయా కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా అశ్వారావుపేట ఉద్యాన కళాశాలలో ప్రవేశం పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు.







కామెంట్లు (0)