నవతెలంగాణ–మక్తల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి వాకిటి లలిత మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి వైభవానికి బతుకమ్మ పండుగ అద్దం పడుతుందని తెలిపారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మక్తల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమన్నారు.
సద్దుల బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్పర్సన్ శైవీ రెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)