సమస్యలపై అధికారుల స్పందన.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటన
నవతెలంగాణ - పరకాల
పరకాల ఆర్టీసీ డిపోలో డ్యూటీల కేటాయింపు, సీనియారిటీ, ఓటీ, నైట్ డ్యూటీల విషయంలో నెలకొన్న సమస్యలపై 'నవతెలంగాణ' ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నెల 10న ప్రచురితమైన కథనం నేపథ్యంలో డిపోలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు దృష్టి సారించారు. కార్మికుల అభ్యంతరాల నేపథ్యంలో నవంబర్ 17న నిర్వహించాల్సిన డ్యూటీ చార్ట్ కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రకటించారు.
తిరిగి కౌన్సిలిగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. నవతెలంగాణ కథనం ప్రచురితమైన అనంతరం డిపోలోని వివిధ కార్మిక సంఘాలు, అసోసియేషన్లు డ్యూటీ చార్ట్‌పై తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ట్రేడ్ యూనియన్ (టీడబ్ల్యూయూ), ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు డిపో అధికారులకు వినతిపత్రాలు, మెమోరాండాలు సమర్పించారు.
మరోవైపు డిప్యూటీ ఆర్ఎంవో సైతం పరకాల ఆర్టీసీ డిపోను సందర్శించి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. డ్యూటీ చార్ట్‌కు సంబంధించి కార్మికుల్లో నెలకొన్న అభ్యంతరాలు, సమస్యలపై డిపో మేనేజర్ స్పందిస్తూ వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో నవంబర్ 17న జరగాల్సిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డ్యూటీ చార్ట్‌పై నెలకొన్న సమస్యలను పరిష్కరించిన అనంతరం కొత్త కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. కార్మికుల సమస్యలపై 'నవతెలంగాణ' ప్రచురించిన కథనం అనంతరం కౌన్సిలింగ్ రద్దు కావడంతో డిపోలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.







కామెంట్‌లు (0)