- పనిచేయని హ్యాండ్‌వాష్ బేసిన్లు..
- ఉసూరుమంటున్న ఊరు బడులు
- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు తప్పని తిప్పలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఊరికి వెలుగునిచ్చే బడులు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కొరత, సరిపడా తరగతి గదులు లేకపోవడం, తాగునీటి వసతులు ఉన్నా వినియోగానికి నోచుకోకపోవడం వంటి సమస్యలు దర్శనమిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో వంటగదులు లేక ఇంటి వద్ద వంట చేసి మధ్యాహ్న భోజనం తీసుకొస్తుండగా.. మరికొన్ని చోట్ల వరండాలే తరగతి గదులుగా మారాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
శుక్రవారం నవతెలంగాణ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా ఈ దుస్థితి వెలుగుచూసింది.
ప్రతిఏటా యూడీఐఎస్ఈ( యూడైస్ ) ద్వారా విద్యాశాఖ పాఠశాలల వారీగా అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, ఇతర వసతుల వివరాలను నమోదు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. నీటి సౌకర్యం ఉన్నప్పటికీ పనిచేయని ట్యాంకులు, హ్యాండ్‌వాష్ బేసిన్లు, వంటగదుల కొరత వంటి సమస్యలు విద్యార్థుల దైనందిన కార్యకలాపాలకు ఆటంకంగా మారుతున్నాయి.
ఏకోపాధ్యాయుడికి తప్పని తిప్పలు:
జీపీఎస్ వాగొడ్డుగూడెంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు గదులు ఉన్నప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్నారు. ఒకేసారి ఐదు తరగతులను బోధించడం ఆయనకు సవాలుగా మారింది. పాఠశాలలో చేతిపంపునకు మోటారు ఏర్పాటు చేసినప్పటికీ అది పనిచేయడం లేదు. ఈ గ్రామం నుంచి నలుగురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తుండగా, వారిలో ఇద్దరిని ఈ విద్యాసంవత్సరంలో స్థానిక ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మరో ఇద్దరిని వచ్చే విద్యాసంవత్సరంలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
రెండు గదుల్లో మూడు తరగతులకంటే ఎక్కువ..
రామన్నగూడెం పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే తరగతుల నిర్వహణకు కేవలం రెండు గదులే ఉండటంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ప్రధానోపాధ్యాయులు వి.ప్రసాదరావు అన్నారు.
ఎంపీపీఎస్ దిబ్బగూడెం (ఆర్)లో 32 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఐదు తరగతులకు ఒకే గది మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి తోడు పాఠశాలలో వంటగది లేదు. దీంతో ఇంటి వద్దే వంట చేసి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలకు తీసుకొస్తున్నారు. మరోవైపు పాఠశాల భవనంలోని ఒక గది శిథిలావస్థకు చేరింది అని ప్రధానోపాధ్యాయులు రామారావు తెలిపారు.
వరండాలోనే నాలుగు తరగతులు:
ఎంపీయూపీఎస్ పండువారిగూడెంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు నిర్వహించాల్సి ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రస్తుతం నాలుగు తరగతులే నిర్వహిస్తున్నారు. మొత్తం 51 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలోనే నాలుగు తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలోని వంటగది సైతం శిథిలావస్థకు చేరిందని ఉపాద్యాయురాలు క్రిష్ణ కుమారి తెలిపారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయులు బాలు నాయక్ కాంప్లెక్సు కేంద్రం పాఠశాలకు వెళ్ళారని క్రిష్ణకుమారి తెలిపారు.
పర్యవేక్షణతో పాటు పరిష్కారాలూ అవసరం:
కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు తరగతుల్లో పాఠ్యాంశాలపై దృష్టి సారించకుండా ఉండటం, ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లలో నిమగ్నమై ఉండటం వంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ఇది బోధన పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఒకవైపు విద్యాశాఖ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఉన్న విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
యూడైస్ నివేదికల్లో అవసరాలు నమోదు చేయడంతోనే బాధ్యత ముగియకుండా, వాటి ఆధారంగా నిధులు కేటాయించి తరగతి గదులు, వంటగదులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను నియమించడంతో పాటు శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలి. అప్పుడే గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.







కామెంట్‌లు (0)