వర్షాభావంతో తీవ్ర పశుగ్రాసం కొరత
నవతెలంగాణ - మల్హర్ రావు
అటు పంటలు పండక, ఇటు పాడి ద్వారా ఆదాయం రాక ఆర్దికంగా చితికిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో కురిసిన చిరు జల్లులు నేలను తడిపాయే తప్ప పచ్చిక పెరిగేందుకు సరిపోలేదు. పచ్చిగడ్డి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా పశువులకు సరిపడా మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. వానకాలం లోటు వర్షపాతం వ్యవసాయంతో పాటు పశుగ్రాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాణా, ఎండుగడ్డి కొనుగోలు చేసి పశు వులను పోషించడం చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారింది. పాల ద్వారా వచ్చే ఆదాయం కంటే పోషణ ఖర్చులే రెట్టింపు అవు తుండటంతో చేసేదేమీ లేక రైతులు తమ జీవనాధారమైన పశువులను అమ్ముకుంటున్నారు.
గడ్డి కొనుగోలు భారం..
పశువులను అమ్ముకోలేని రైతులు అప్పు చేసి ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నారు. పచ్చిగడ్డి అందుబాటులో ఉంటే ఒక మోపు గడ్డి మూడు రోజులు వచ్చేది, కానీ ఇప్పుడు ఒక్క మోపు ఎండుగడ్డి రెండు రోజులకే సరిపోతోంది. రెండు గేదెలు ఉన్న రైతు సాధారణంగా వర్షాకాలం, ఎండా కాలం కలిపి 200 మోపుల ఎండుగడ్డి కొనుగోలు చేస్తుంటాడు. రవాణా ఖర్చులతో కలిపి ప్రస్తుతం ఒక గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. వర్షాలు లేక వరి చేన్లు ఎండిపోవడంతో రానున్న రోజుల్లో వరి గడ్డికి మరింత కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది
సరైన పోషకాహారం అందక..
వర్షాలు లేక గడ్డి మొలకెత్తకపోవడంతో పశువులు ఎండుగడ్డి, ఇతర దాణాపైనే ఆధారపడాల్సి వస్తోంది. సరైన పోషకాహారం అందక పాల దిగుబడి నిలువునా పడిపోతోంది. మూడు నెలల క్రితం రూ.800 ఉన్న 50 కేజీల దాణా బస్తా ధర క్రమక్రమంగా పెరిగి రూ.1,300కు చేరింది. రోజుకు అర కేజీ దాణా చొప్పున వేసే రైతుకు రెండు గేదెలు ఉంటే నెలకు రూ.500 అదనపు భారం పడుతోందని పశు పోషకులు చెబుతున్నారు.






కామెంట్‌లు (0)