నవతెలంగాణ-హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. క్రాన్స్ మోంటానాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఒక బార్‌లో భారీ పేలుడు జరిగి పలువురు మరణించినట్లు స్విస్ పోలీసులు గురువారం తెలిపారు. పేలుడుకు గల కారణం తెలియరాలేదని అన్నారు.
స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లే కాన్‌స్టెలేషన్ బార్‌లో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులంతా వేడుకల్లో నిమగమై ఉండగా బుధవారం తెల్లవారుజామున (సుమారు 1.30 గంటలకు) పేలుడు జరిగిందని నైరుతి స్విట్జర్లాండ్‌లోని వాలిస్ కాంటన్ పోలీస్ ప్రతినిధి గేటన్ లాథియోన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బార్‌లో వందమందికి పైగా ఉన్నారని, ప్రముఖ టూరిస్ట్ కేంద్రం కావడంతో పర్యాటకులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న వివరాలపై స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. భవనం మంటల్లో చిక్కుకోగా, సహాయక సిబ్బంది అత్యవసర సేవలు చేపడుతున్న దృశ్యాలు స్విస్ మీడియాలో కనిపించాయి.



