Friday, May 2, 2025
Homeరాష్ట్రీయందారుల్‌షిఫా ఇబాదత్‌ఖాన్‌ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయొద్దు

దారుల్‌షిఫా ఇబాదత్‌ఖాన్‌ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయొద్దు

– సింగిల్‌ జడ్జి తీర్పు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దారుల్‌షిఫా ఇబాదత్‌ఖాన్‌ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయరాదంటూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇబాదత్‌ఖాన్‌ను స్వాధీనం చేసుకుని ముస్లింలోని ఇరువర్గాల వారితో కమిటీ ఏర్పాటు చేయాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే మంజూరు చేసింది. ఇబాదత్‌ఖాన్‌ను స్వాధీనం చేసుకుని షియా, ఇమామియా, ఆషరీ, అక్బరీ, ఉసులీలు అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైన మీర్‌ హస్నయిన్‌ అలీఖాన్‌, మరొకరు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరు పాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది. అప్పీలులో జాప్యాన్ని మన్నించడంతోపాటు అదనపు పత్రాలు దాఖలు చేయడానికి అప్పీలుదారులకు అనుమతించింది. పిటిషనర్‌ అభ్యర్థనకు మించి సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించారన్న అప్పీలుదారుల ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నందున సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తున్నామని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా కమిటీని ఏర్పాటు చేయరాదని తెలిపింది. ఇందులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 3కు వాయిదా వేసింది.
గ్రూప్‌-1 పరీక్షలపై వాదనలు : హైకోర్టు విచారణ నేటికి వాయిదా
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను టీజీపీస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్వహించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఎవాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌ టిక్కెట్‌లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. వెబ్‌నోట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. మెయిన్స్‌ వారంలో జరుగుతాయనగా కొత్త నెంబర్లతో హాల్‌టికెట్‌లు జారీ అయ్యాయన్నారు. వరుసగా నెంబర్లు కేటాయించడానికి సులభంగా ఉంటుందని టీజీపీఎస్సీ చెబుతున్న కారణం సహేతుకంగా లేదని తెలిపారు. కేవలం కొంత మందికి లబ్ది చేకూర్చడానికే మెయిన్స్‌కు హాల్‌టికెట్లను వేరుగా ఇచ్చారన్నారు. యూపీపీఎస్సీకి లక్షల మంది హాజరైనప్పటికీ ఒకే హాల్‌టిక్కెట్‌ జారీ చేశారన్నారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించారన్నారు. మొదట 21,075 మంది అని ప్రకటించి తరువాత 21,085 మంది అని వెల్లడిం చారన్నారు. 10 మంది అదనంగా ఎలా వచ్చారన్నదానికి స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదన్నారు. కోఠి మహిళా కళాశాలలో పురుషులకు మరుగు దొడ్లు లేవన్న కారణంగా వారి అభ్యర్థన మేరకు మహిళలనే కేటాయించామని టీజీపీఎస్సీ చెబుతోందన్నారు. అలాంటప్పుడు మిగిలిన మహిళా కళాశాలల్లో పురుషులు, స్త్రీలు కలిసి ఎలా పరీక్ష రాశారని ప్రశ్నించారు. అక్కడ కేవలం మహిళలనే ఎందుకు కేటాయించలేదన్నారు. ఇటీవల జరిగిన యూపీఎస్సీ పరీక్షలను కోఠిÄ మహిళా కళాశాలలో నిర్వహించారనీ, పురుషులు, మహిళలు ఇద్దరూ అక్కడ హాజరయ్యారన్నారు. ఈ కేటాయింపుల్లో గూడుపుఠాని ఉందని అందువల్ల కోఠి మహిళా కళాశాలలోని రెండు సెంటర్లలో పరీక్ష రాసిన మహిళలు ఎక్కువ మంది అర్హత సాధించారన్నారు. ముందు వెనుక కూర్చున్నవారికి, పక్క పక్కన ఉన్న నెంబర్లకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని బట్టి చూస్తే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్నది స్పష్టమవు తుందన్నారు. ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరిగా యన్నారు. వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్‌ ఫలితాలను వెల్లడించలేదన్నారు. అభ్యర్థులు లాగిన్‌ అయి సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవాలన్నారనీ, అయితే ఈ మధ్య పలుమార్లు లోపల మార్కులు మారిపోయాయన్నారు. మార్కులు తగ్గడంపై వినతి పత్రం సమర్పిస్తే నకిలీ అంటూ బెదిరించి క్రిమినల్‌ కేసు పెట్టారన్నారు. వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ, వేల మంది అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారనీ, శుక్రవారంతో వాదనలను ముగించాలని న్యాయవాదులకు సూచించారు.
ఈటల రాజేందర్‌కు చుక్కెదురు : పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పోచారం పోలీసు స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. రియల్‌ ఎస్టేట్‌దారుల ఆక్రమణలపై ఘట్‌కేసర్‌ కొర్రేములలో ఏకశిలా ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిరసన కార్యక్రమంలో భాగంగా తనపై దాడి చేశారంటూ శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్స్‌ సెక్యూరిటీ గార్డు గ్యారా ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షలతో నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఈటల రాజేందర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో మినీ ట్రయల్‌ నిర్వహించలేదనీ, కింది కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలున్నందునే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామనీ, ఈ దశలో కేసును కొట్టివేయడం సరికాదన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదనతో ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో 111పై కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు
హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లో జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన కన్వెన్షన్‌ సెంటర్ల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ అధికారులతోపాటు కన్వెన్షన్‌ సెంటర్లకూ ఈ నోటీసులందజేసింది. జీవో 111కు విరుద్ధంగా నీటి పరీవాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద కన్వెన్షన్‌ సెంటర్లను అక్రమంగా నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలానికి చెందిన మందాడి మాధవరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరు పాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రయివేటు వ్యక్తులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో వ్యవస్థలు వైఫల్యం చెందడంతో ఇటీవల ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందన్నారు.
శంకర్‌పల్లి మెయిన్‌రోడ్డులోని జన్వాడ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెలిసిన పెద్ద పెద్ద కన్వెన్షన్‌ సెంటర్లలో రోజుకు 3 నుంచి 5 వేల మందికి ఆతిథ్యం ఇస్తున్నాయన్నారు. ఈ ఫంక్షన్ల సందర్భంగా ఘన, ద్రవ, ఆహార వ్యర్థాలను నేరుగా చెరువుల్లోకి వదులుతుండటంతో కలుషితమవుతున్నా యన్నారు. కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణాలు తెలంగాణ బిల్డింగ్‌ నిబంధనలు, వాల్టా, నాలా చట్టాలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్‌ఎండీఎ, జలమండలి, జీహెచ్‌ఎ ంసీ, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ, ఆనంద కన్వెన్షన్‌, నియో కన్వెన్షన్‌, ఆర్య కన్వెన్షన్‌, కెఎల్‌ఎన్‌ ఉత్సవ్‌, కె.కన్వెన్షన్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వేసవి సెలవుల అనంతరం వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img