Saturday, July 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసోషలిజం, సెక్యులరిజం పదాల అర్థమెంటో తెలుసా?

సోషలిజం, సెక్యులరిజం పదాల అర్థమెంటో తెలుసా?

- Advertisement -

”సోషలిస్టు, సెక్యులర్‌ అనే పదాలు దేనికి ప్రతీక వాటివల్ల ఎవరికైనా అర్హతకు మించిన లబ్ధి జరుగుతుందా? రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ అనే పదాలు ఉండాల్సిన అవసరం లేదు” ఇటీవల కాలంలో మనువాద అనుయాయుల నుంచి ఇలాంటి చర్చ ఎక్కువైంది. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే దాన్ని బలపరుస్తున్న వారంతా సోషలిస్టు, సెక్యులర్‌ అనే పదాల అర్థాలు తెలిసిన వారేనా? సెక్యులర్‌ అంటే ”ముస్లిం మతానికి ప్రాధాన్యత నివ్వడం” లేదా ”ఇతర మతాలను హిందూ మతంతో సమానంగా భావించడం”, సోషలిజం అంటే ”ఉన్న వాళ్లది లాక్కెళ్లి పేదవాళ్లకు పంచిపెట్టడం” వంటి అవగాహనా రాహిత్యంలోని అక్కసు మాత్రమే. ఇలా తమ కాళ్లను తామే నరుక్కునే స్థితిలోకి పడిపోతుండటం చాలా బాధాకరం. సామ్యవాదం, సెక్యులరిజం అనే పదాలు బాధ్యతను నెరవేర్చడానికి తీసుకున్న ప్రమాణాలు మాత్రమే. పరిపాలనలో ఇలాంటి రాతపూర్వక ప్రతిజ్ఞ కూడా లేకుంటే పాలకవర్గాలు ఇష్టారీతినా చెలరేగిపోవా? ఒక్కమాటలో చెప్పాలంటే ఆధిపత్యం లేనివాదమే సామ్యవాదం. పక్షపాతం లేని ప్రయాణమే సెక్యులరిజం.
సెక్యులరిజం అంటే? ”పరిపాలనలో మతం జోక్యం చేసుకోరాదు, మత వ్యవహారాల్లో పాలకులు జోక్యం చేసుకోరాదు” అని కదా నిజమైన అర్థం. అధికారిక జీవితంలో వ్యక్తిగత ప్రాథమ్యాలు ఉండకూడదు, వ్యక్తిగత ఆచార వ్యవహారాలపై రాజ్యము లేదా పాలనా సంబంధిత నిబంధనలు ఉండరాదు. ప్రజాస్వామ్య దేశంలో ఇది సహజం అమలవుతుంది. దేశంలోని వివిధ మతాల ప్రజలు, ఆయా మతాలు విభిన్నమైన సంస్కృతులను పాటిస్తారు. ఇస్లాం క్రైస్తవ బౌద్ధ, హిందూ మతాల్లోని అనేక సంప్రదాయాలు ప్రాంతాలను బట్టి అందులోని రకరకాల జాతుల, కులాల, ఉపకులాలను బట్టి మారుతూ ఉంటాయి. ఒకే దేవుడికి శాఖాహారము, మాంసాహారము విడివిడిగా కలిసి నైవేద్యాలు సమర్పించబడతాయి. ఆచార వ్యవహారాలను నిర్బంధంగా అమలు జరిపించడం అసాధ్యం. పూర్తి క్రూరమైన మత రాజకీయాల్లో ప్రజల వ్యక్తిగత ఆచార వ్యవహారాలపై కూడా నిర్బంధాలు ఉంటాయి. అంటే ఏ దేవుడిని పూజించాలి, ఏ ఆచార సంప్రదాయాలు పాటించాలో పాలకులు శాసిస్తారు. అలాగే మత పెద్దలు కూడా పరిపాలన ఎలా ఉండాలో? ప్రజలను ఏ విధంగా నియంత్రించాలో? పాలకులకు నిర్దేశిస్తారు. యూరప్‌లో క్రైస్తవ మిషనరీలు పాలకులను ఆ విధంగా శాసించాయి. కనుకనే అలాంటి పాలనలన్నీ కూలిపోయాయని చరిత్ర చెప్పిన సత్యం. సోషలిజం అంటే? సంక్షేమ రాజ్యమని అర్థం. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 39 నుండి 51 వరకు సంక్షేమ రాజ్యంపై ఆదేశిక సూత్రాల ద్వారా స్పష్టంగా పేర్కొన్నది. ఆర్టికల్‌ 41 మరింత స్పష్టంగా ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత లేమిటో విశద పరిచింది. రాజ్యమంటే కుటుంబ యజమాని. కుటుంబ యజమాని ఎలాగైతే ఆహారం, ఆరోగ్యం, చదువు, ఉపాధి, వృద్ధాప్య భాధ్యతపై దృష్టిపెట్టి సహకరించి భవిష్యత్తుకు బాట చూపిస్తాడో రాజ్యం కూడా తన ప్రజలకు అదేవిధమైన సహకారాన్ని అందించాలని ప్రమాణం చేసిన క్రమమే సామ్యవాదం. ఈ పదం రాజ్యాంగంలో ఉంది గనుక ఉచిత పథకాల ద్వారా ప్రజలకు దోచిపెడుతున్నారు అనే దుర్భావనలో కొందరు న్నారు. సంక్షేమ రాజ్యమంటే ఉచిత పథకాల ద్వారా చేయి విదల్చడం కాదు. ప్రజల నుండి వివిధ రూపాల్లో వచ్చిన పన్నుల ద్వారా కావాల్సిన మౌలిక వసతులు, కర్మాగారాలు, రవాణా సౌకర్యాలు, భారీ ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రోజువారి గడవటానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడం.
1970వ దశకంలోనే మతప్రాతిపదిక రాజకీయాలకు కుంపటి అంటుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యవహరించిన తటస్థ (న్యూట్రల్‌) పద్ధతికి ఇందిరాగాంధీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్న వాదనకు ప్రతిపక్ష పదును పెట్టింది. మరోవైపు కుల అంతరాలతో అంటరానితనం సమసిపోలేదని నాటి ప్రభుత్వం గమనించింది. కులమత అంతరాలు అధికారిక కార్యక్రమాల్లో ఉండరాదని ఇందిరాగాంధీ భావించారు. దేశ పరిపాలనలో వ్యక్తిగత సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు తావుండకూడదని సెక్యులర్‌ అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. ఇప్పుడు సెక్యులరిజం అనే పదాన్ని తీసేస్తే దేశం ఒక మత రాజ్యంగా అవతరిస్తుంది. మత రాజ్యంగా అవతరించిన తర్వాత ఏ కార్యక్రమాలు, ఎలాంటి పూజలు, పునస్కారాలు చేయాలో గద్దెనెక్కిన వారే నిర్ణయిస్తారు. అంటే పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి సెంగోల్‌ పట్టుకుని ఒకరెళితే మరొక జాతికి సంబంధించిన వ్యక్తి ప్రధాని అయినప్పుడు జంతుబలి లేదా మరే ఇతర పద్ధతిలోనో ప్రారంభోత్సవం చేస్తారు. ఈ వ్యవహారాలను గమనించి మఠాధిపతులు, పీఠాధిపతులు దేవస్థానాల బోర్డులు, కులసంఘాలు, మత సమూహాలు తమలో తాము విభేదించి తీవ్ర ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడానికి అవకాశం లభిస్తుంది. సెక్యులరిజం వ్యక్తిగత ఆచారాలకు నిర్బంధాన్ని విధించకుండా అధికారిక ప్రయాణాల్లో పాటించాల్సిన నిష్పక్షపాత పద్ధతులను సూచించే దిక్సూచి లాంటిది.
ఇటీవల చూస్తే ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు యాభై ఏండ్ల కింద భారతదేశంలో విధించిన అత్యవసర పరిస్థితిపై చర్చ జరుపుతూ భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ అనే పదాలపై విరుచుకు పడుతున్నారు.సామ్యవాదం, సెక్యులరిజం అనే పదాలు హిందూ మతానికి వ్యతిరేకమైనవిగా చిత్రీకరిస్తున్నారు. అంబేడ్కర్‌ పొందుపర్చిన రాజ్యాంగ పీఠిక కావాలా? ఇందిరా గాంధీ మార్చి రాసిన రాజ్యాంగ పీఠిక కావాలా? అంటూ అర్నాబ్‌ గోస్వామిలాంటి వాళ్లు విషయాన్నీ విడమర్చకుండానే విద్వేషాన్ని విరజిమ్ముతున్నారు. ద్వేష పార్టీల సోషల్‌ మీడియా సైనికులు తమ వాట్సాప్‌ వాహనాలపై దీన్ని ఊరేగిస్తున్నారు. ఇది చాలా నష్టదాయకమైన పోకడ.ఆ నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం పీఠికలో సెక్యులర్‌, సోషలిస్ట్‌ అనే పదాలను జోడించించారు.అయితే ఇదేదో ప్రజలమీద ప్రేమతో కాదు. అనాటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల అలా జోడించాల్సి వచ్చింది. 1970వ దశకం ప్రారంభం నుండి ఆర్థిక సంక్షోభం మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి అప్పటికి 25 ఏండ్లు గడిచిపోయినా ప్రజల ఆర్థిక స్థితుల్లో మార్పులు లేకపోగా స్వాతంత్య్ర ఫలాలను భూస్వాములతో కలిసి పెట్టుబడిదారులు మాత్రమే ఆరగించడం పెరిగిపోయింది. నిరుద్యోగం విపరీతమైంది. గ్రామాల్లో దేశ్‌ముఖ్‌ల వంటి పెత్తందారీ వ్యవస్థ తగ్గిపోయినప్పటికీ దొరల పాలనలో అసమానతల పర్వం తారాస్థాయికి చేరింది. ఆ సందర్భంలో ‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని కూడా ఇందిరాగాంధీ తీసుకున్నారు. అయితే ఈ పరిస్థితులను అప్పటి ప్రతిపక్ష రాజకీయ సమూహాలు సరిగ్గా ఎత్తి చూపటం ప్రారంభించాయి. అభ్యుదయ రీతిలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అంశాన్ని అప్పటి తరానికి గుర్తుండటం వల్ల, ప్రధానిని వ్యతిరేకించడానికి కోర్టులు కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేయడం, అలహాబాద్‌ హైకోర్టు తీర్పునివ్వడం వీటి పర్యవసానాలుగా ఇందిరాగాంధీ భావించారు. అందుకే తమ ప్రభుత్వం ”ప్రజా సంక్షేమాన్ని వీడింది” అనే దుష్ప్రచారం జరుగుతోందని, తమది సంక్షేమ ప్రభుత్వమని సరాసరి రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం అని పదాన్ని జోడించి రుజువు చేసుకున్నారు. అయితే ఈ సామ్యవాదం అనే పదాన్ని చేర్చిన తర్వాతనే, 1976లో ”సమాన పనికి సమాన వేతనం” అనే చట్టం చేయబడింది.
ఎమర్జెన్సీ విధింపు కూడా రాజ్యాంగంలోని 352 అధికరణం ద్వారా సాధ్యపడిందని మరిచిపోరాదు. ఆనాటి రాజ్యాంగాన్ని చీకటి అధ్యాయంగా ప్రస్తావించేవారు మరోవిషయాన్ని మర్చిపోతున్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో అనేక కొత్త రాష్ట్రాలు సృష్టించబడ్డాయి. కానీ మొదటిసారి రాష్ట్ర హోదా కలిగిన జమ్మూ కాశ్మీరును కేంద్రపాలిత ప్రాంతానికి కుదించడం కూడా ఎమర్జెన్సీకి తక్కువేమీ కాదు. ఆంండ్ల తర్వాత కూడా రాష్ట్ర హోదాను కల్పించకుండా ఎన్నికైన ప్రభుత్వానికి నామమాత్రపు అధికారు లతో కేంద్ర ప్రభుత్వమే అధికారాన్ని శాసిస్తూ, అక్కడి ప్రజలకు తీరని అన్యాయం చెయ్యట్లేదని చెప్పలేం. ఆర్టికల్‌ 370 రద్దు చేయడానికి జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తీసివేయడానికి సంబంధమే లేదు. ఏదో విపత్తుకు భయపడి 2019లో కేంద్రం జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిందని, అలా మార్చడం దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమనేది కాదనలేము. ఏకపక్ష ధోరణితో ప్రతిపక్షానికి, ప్రభుత్వ పక్షానికి అవకాశం లేని పరిమిత స్వేచ్ఛపై పుల్వామా నుండి పహల్గామ్‌ వరకు తూటాలు కురుస్తూనే ఉన్నవి. అందుకే ప్రతిఅంశంపై ద్వేష భావనతో కాకుండా దీర్ఘాలోచనతో స్పందించడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో సముచితం.
– జి.తిరుపతయ్య
9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -