Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో కుక్క‌కు నివాస గుర్తింపు..బీజేపీపై విప‌క్షాలు సెటైర్లు

బీహార్‌లో కుక్క‌కు నివాస గుర్తింపు..బీజేపీపై విప‌క్షాలు సెటైర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ ఏడాది చివ‌ర‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌తో చిత్ర‌విచిత్రాలు జ‌రుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ అయ్యింది. దీంతో ఆ కుక్క బీజేపీకి ఓటు వేస్తుందని విపక్షాలు విమర్శించాయి.

రాజధాని పాట్నా సమీపంలోని మసౌర్హి పట్టణంలోని ప్రజా సేవల హక్కు (ఆర్టీపీఎస్‌) పోర్టల్‌లో ‘డాగ్ బాబు’ పేరుతో రెసిడెంట్‌ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేశారు. ఇందులో తండ్రి పేరు ‘కుట్ట బాబు’ అని, తల్లి పేరు ‘కుట్టియా దేవి’ అని ఉన్నది. కౌలిచాక్‌, వార్డ్ నంబర్ 15, నగర్ పరిషత్ మసౌర్హిని చిరునామాగా పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి ఫొటో స్థానంలో కుక్క బొమ్మ ఉన్నది. రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ డిజిటల్‌ సంతకంతో జూలై 24న ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయ్యింది.

కాగా, ‘కుక్క బాబు’కు జారీ చేసిన ఈ రెసిడెంట్‌ సర్టిఫికెట్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ కుక్క ప్రత్యక్షమై బీజేపీకి ఓటు వేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ‘బహుశా వారు ‘డాగ్ బాబు’ను అభ్యర్థిగా కూడా చేస్తారేమో. బీజేపీ కార్యకర్తలందరూ ఆయనకు ఓటు వేస్తారు. ఇది ఎన్నికల వ్యవస్థను బీజేపీ నగ్నంగా తారుమారు చేయడం, @ECISVEEP ద్వారా క్రిమినల్ సిండికేట్‌గా పనిచేస్తున్న నేరస్థుల పని ఇది. కోర్టులు పక్కదారి పట్టాయి. ప్రజాస్వామ్య మారణహోమాన్ని నిశ్శబ్దంతో ఆశీర్వదిస్తున్నాయి’ మండిపడింది.

ఆధార్, రేషన్ కార్డులు నకిలీవి అని పిలుస్తున్నప్పుడు, ఓట్ల సవరణ కోసం పరిగణించే సర్టిఫికేట్ ఇదేనని స్వరాజ్ ఇండియా సభ్యుడు యోగేంద్ర యాదవ్ ఎద్దేవా చేశారు.

మరోవైపు అధికారులు దీనిపై స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడు, కంప్యూటర్ ఆపరేటర్, సర్టిఫికేట్ జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతామని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -