నవతెలంగాణ-హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో వింత తప్పులకు తరచూ వార్తల్లో నిలిచే బీహార్ లో మరో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కోర్టులో ప్యూన్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి అడ్మిట్ కార్డులో అతని ఫోటో స్థానంలో కుక్క చిత్రం కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. రోహ్తాస్ జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ అనే యువకుడు 2022లో జిల్లా కోర్టులో ప్యూన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత మార్చి 15, 2026న జరగనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అతను షాక్ అయ్యాడు.
అడ్మిట్ కార్డులో అభ్యర్థి ఫోటో ఉండాల్సిన చోట ‘గోల్డెన్ రిట్రీవర్’ కుక్క చిత్రం కనిపించింది. దరఖాస్తు చేసేటప్పుడు తాను సరైన ఫోటోనే అప్లోడ్ చేశానని రాకేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తు రసీదు కూడా తన వద్ద ఉందని చెప్పారు. ఈ తప్పు కారణంగా తన స్నేహితులు మరియు స్థానికులలో తాను నవ్వుల పాలవుతున్నానని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తేదీ సమీపిస్తున్నప్పటికీ, తన ఫిర్యాదుపై అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులో ఉన్న తప్పును వెంటనే సరిదిద్దాలని, తనను పరీక్ష రాయడానికి అనుమతించాలని రాకేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కూడా బీహార్‌లో అడ్మిట్ కార్డులపై వింత ఫోటోలు కనిపించిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. ఒక సందర్భంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రంతో కూడిన అడ్మిట్ కార్డు వెలుగులోకి వచ్చి పెద్ద చర్చకు దారితీసింది.



