నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిసింది. మార్కెట్లు లాభాల్లో మొదలైనా.. ఆ తర్వాత మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,116.17 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలోనే 30 షేర్ల బీఎస్‌ఇ సెన్సెక్స్ 82,250.42 పాయింట్ల గరిష్టానికి చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,153.70 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 867.91పాయింట్లు పతనమై.. 81,191.51 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 261.55 పాయింట్లు తగ్గి 24,683.90 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు తగ్గి 85.63 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 1,398 షేర్లు లాభపడగా.. మరో 2,415 షేర్లు పతనమయ్యాయి.
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ 1.60శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, ఐటీ, హెల్త్‌కేర్, పవర్, కన్యూమర్ డ్యూరబుల్ రంగాల సూచీలు అన్నీ నష్టపోయాయి. అత్యధికంగా ఆటో షేర్లు 2శాతానికిపైగా పతనమ్యాయి. నిఫ్టీలో నిఫ్టీ, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, హిందాల్కో, రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రికల్ లాభపడ్డాయి. ఎక్స్‌టర్నల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, ఐచర్ మోటార్స్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే నష్టాల్లో ముగిశాయి.