నవతెలంగాణ-హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి అయిన తన భర్త వేధింపులతో గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. రాజస్థాన్ ఐఏఎస్ అధికారిణి భారతీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అయిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం డైరెక్టరు ఆశిష్ మోదీపై జైపుర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా భారతీ దీక్షిత్ విధులు నిర్వర్తిస్తున్నారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఏడాది తమ వివాహమైనప్పటి నుంచీ ఆశిష్ మోదీ తరచూ మద్యం తాగి.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు తెలిపారు.
పాప పుట్టాక వేధింపులు మరింత పెరిగాయని, అత్తింటివారి నుంచి తన ప్రాణాలకు హాని కూడా ఉందని భారతి ఫిర్యాదులో వెల్లడించారు. పలువురు నేరస్థులతోనూ ఆశిష్‌కు సంబంధాలున్నాయన్నారు. గత నెల ఓ స్నేహితుడితో కలిసి తనను ప్రభుత్వ వాహనంలో తరలించి, కొన్ని గంటలపాటు నిర్బంధంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. విడాకులకు అంగీకరించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని తుపాకీ గురిపెట్టి బెదిరించారని భారతి ఆరోపించారు. ఆశిష్‌ను వివరణ కోరగా ఫిర్యాదుపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.



