నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ సమీపంలో ఓ ఆఫ్ఘన్ వలసదారుడు జరిపిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మొత్తం 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కఠిన పరిశీలనకు ఆదేశించారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస దరఖాస్తులను నిలిపివేసిన ట్రంప్ సర్కార్, మరో 18 దేశాల వారి గ్రీన్ కార్డులను క్షుణ్ణంగా పునఃపరిశీలించనుంది.
బుధవారం వైట్‌హౌస్ వద్ద రహ్మానుల్లా లకన్‌వాల్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సారా బెక్‌స్ట్రామ్ అనే సైనికురాలు గురువారం చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల్లో గాయపడిన నిందితుడు లకన్‌వాల్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన తర్వాత అమెరికా కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో గురువారం మాట్లాడుతూ, “ఆందోళనకర దేశాల నుంచి వచ్చిన ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును కఠినంగా పునఃపరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు” అని తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు లక్షలాది మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ప్రభావం పడనుంది.
ఈ 19 దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మయన్మార్, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్, వెనిజులా వంటి దేశాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో భారత్ లేదు. దక్షిణాసియా నుంచి కేవలం ఆఫ్ఘన్ మాత్రమే ఈ జాబితాలో ఉంది.



