నవతెలంగాణ – హైదరాబాద్: 2017లో కేరళ నర్సు నిమిష ప్రియ చేతిలో హత్యకు గురైన యజమాని తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దేల్‌ఫట్టా మెహదీ, ఈ నేరానికి క్షమాపణ ఉండదని నొక్కి చెప్పారు. నిమిష ప్రియను ఉరితీయాలని ఆయన అన్నారు. దోషిగా తేలిన నిమిషను భారతీయ మీడియా బాధితురాలిగా చిత్రీకరించడం పట్ల తన కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అబ్దేల్‌ఫట్టా పేర్కొన్నారు.
కాగా, నిమిష ప్రియకు బుధవారం ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ బహుముఖ చర్చల కారణంగా ఆమె ఉరిశిక్షను నిలిపివేశారు. సౌదీ అరేబియాలోని ఏజెన్సీలతో పాటు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు, యెమెన్‌లోని షూరా కౌన్సిల్‌లోని ఒక స్నేహితుడిని మధ్యవర్తిత్వం కోసం సంప్రదించిన గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ మతపరమైన జోక్యం ఫలితంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిశిక్షను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉంటే… నిమిష ప్రియను క్షమించగలిగేది మృతుడి కుటుంబమే. అయితే, ఆయన కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అధికారులతో పాటు, చర్చలలో పాల్గొన్న మతపరమైన వ్యక్తులు ఈ సమస్యను పరిష్కరించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అటు, కేరళ బిలియనీర్ ఎంఏ యూసుఫ్ అలీ కూడా ఈ విషయంలో అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.