Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅపోహలను నమ్మొద్దు

అపోహలను నమ్మొద్దు

- Advertisement -

– హాని కలిగించే చెట్ల తొలగింపు
– సీఎం పర్యటన కోసం భూమి చదును
– నేడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో వనమహౌత్సవం
– పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
– మీడియా సమావేశంలో యూనివర్సిటీ ఉపకులపతి జానయ్య
నవతెలంగాణ రాజేంద్రనగర్‌

వాతావరణానికి హాని కలిగించే చెట్లను నెల రోజులుగా యూనివర్సిటీలో తొలగిస్తున్నామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఉపకులపతి జానయ్య తెలిపారు. నేడు యూనివర్సిటీలో నిర్వహించే వన మహౌత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారని, అందుకే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని చెదను చేశామన్నారు. ఆదివారం యూనివర్సిటీ బొటానికల్‌ గార్డెన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీసీ మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన ఒకరోజు ముందుగా యూనివర్సిటీకి సమాచారం అందించడంతో రాత్రి సమయంలో చెట్ల తొలగింపు, భూమి చదును పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే యూనివర్సిటీలోని విద్యార్థులు బొటానికల్‌ గార్డెన్‌లో రాత్రి సమయంలో జేసీబీల సాయంతో పనులు చేస్తుండటంతో విద్యార్థులకు తెలియక చెట్లను తొలగిస్తున్నారని అడ్డుకున్నారని తెలిపారు. తర్వాత యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులతో చర్చించి అక్కడ వనమహౌత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. అయితే విశ్వవిద్యాలయంలో జరిగే ఈ వనమహౌత్సవం కార్యక్రమంపై కొందరు అసత్య ప్రసారాలను సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసత్య ప్రచారాలను ప్రజల నమ్మొద్దని సూచించారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఈ బొటానికల్‌ గార్డెన్‌ 15ఏండ్లుగా నిరుపయోగంగా ఉందని, మళ్లీ ఇప్పుడు పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. వాతావరణానికి ముప్పు కలిగించే సుబాబుల్‌, యూకలిప్టస్‌ లాంటి అప్రయోజన చెట్లను తొలగించి, వాటి స్థానంలో తెలంగాణలో ఉన్న అరుదైన అటవీ జాతి మొక్కలను, సంప్రదాయ అటవీ జాతి పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున క్యాంపస్‌లో పెంచే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. హెచ్‌ఎండీఏ దత్తత తీసుకొని పచ్చదనాన్ని పెంపొందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగానే వనమోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ అటవీ ప్రాంతంలో అరుదుగా లభించే అటవీ మొక్కలు నాటే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నట్టు వివరించారు. నేడు జరిగే ముఖ్యమంత్రి పర్యటనను యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులతో కలిసి విజయవంతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -