భారత రాజ్యాంగం ఆర్టికల్ 350 ఎ మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెబుతున్నది. ఇది విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 29లోనూ పేర్కొన్నది. విద్యాచట్టం 35/2009 సెక్షన్ 29ఎఫ్ ప్రకారం విద్యార్థులకు మాతృభాషలో ఉండాలని తెలియ జేస్తున్నది.అయితే భాష ప్రాతిపదికన ఏర్పడిన మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక , మహారాష్ట్ర బెంగాల్‌లో వారి భాషాభిమానాన్ని చాటుకుంటూ, వారి మాతృభాషలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్లడం అభినందనీయం. మన రాష్ట్రంలో మాత్రం మాతృభాషలో విద్యాబోధన పట్ల ఒక విధానంగా ప్రభుత్వం ముందుకు సాగడం లేదని అనిపిస్తున్నది. మాతృభాష అంటేనే అమ్మభాష. ఆ తర్వాతే ఏదైనా అనే భావన విద్యార్థులకు చిన్నప్పటినుంచే అలవడాలి. ఎందుకంటే,మాతృభాషలో విద్యార్థులకు విషయ పరిజ్ఞానము సులభంగా అవగాహన అవుతుంది. ఒకటి నుండి ఐదు వరకు ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలి. ఇంటర్, డిగ్రీలలో తప్పనిసరిగా తెలుగును రెండవ భాషగా, ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఎక్కువమంది కార్పొరేట్ కళాశాలలో తెలుగుకు బదులు సంస్కృతాన్ని తీసుకుంటున్న పరిస్థితి ఉంది.అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులపై తెలుగు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంచుతుంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులపై సంస్థ పేరు, నేమ్ బోర్డ్స్, ఊరి పేర్లు పలకలపై తప్పనిసరిగా తెలుగులోనే ఉరాయించాలి. ప్రభుత్వ జీవోలు, ఆర్డినెన్స్ ,ఉత్తర్వులు అన్ని శాఖల్లో, కోర్టు వ్యవహారాలను కూడా తెలుగులోనే ఉండాలి. ఇప్పటికే ఇంగ్లీష్‌లో ఉండే ఎఫ్‌ఐఆర్‌లు, జడ్జిమెంట్లు, అగ్రిమెంట్లకు సంబంధించవన్నీ సామాన్యులకు అర్థం కాని పరిస్థితి ఉన్నది.తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించడం ద్వారా తెలుగు తప్పనిసరి అన్న సంకేతాన్ని ఇవ్వాలి. పొరుగు రాష్ట్రాల్లో దీన్నే పాటిస్తున్న విషయాన్ని గుర్తించాలి.గత ప్రభుత్వం నిర్బంధ ఇంగ్లీష్ మాద్యమంలో ప్రాథమిక విద్యా బోధనను తొలగించి మాతృభాష తెలుగులో కొనసాగించాలి.ఒక మాతృభాష మరుగైతే, ఆ జాతి, దాని సంస్కృతి కూడా మరుగవుతుందన్న విషయం పాలకులు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పటికీ జపాన్, చైనా, జర్మనీ కొన్ని ఇతర దేశాల్లో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు వారి మాతృభాషలోనే బోధన జరుగుతుందండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరూ పోరాడారు, సాధించుకున్నారు. ఇప్పుడు మాతృభాషలో విద్యాబోధన కోసం కూడా అదే విధంగా పోరాడాలని భాషావేత్తల కోరుతున్నారు.
– రాఘవ మాస్టారు కేదారి
‘మాతృభాష’ను మరువద్దు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES