– మహిళా ఆర్మీ అధికారులను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పరిస్థితుల్లో వారి స్థైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావించింది. వారిని ప్రస్తుతానికి సర్వీసు నుంచి విడుదల చేయొద్దని కేంద్రాన్ని ఆదేశించింది. ”వారు తెలివైన అధికారులు. మీరు వారి సేవలను వేరే చోట ఉపయోగించుకోవచ్చు. ఇది కోర్టు చుట్టూ తిరగాల్సిన సమయం కాదు. దేశానికి సేవచేయడానికి వారికంటూ మంచి స్థానం ఉంది” అని ధర్మాసనం పేర్కొంది.ఈ విచారణలో భాగంగా కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. వారిని షార్ట్ సర్వీస్ నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎటువంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు. భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరించిన ఇద్దరు మహిళా అధికారుల్లో ఒకరైన కర్నల్ సోఫియా ఖురేషీ గురించి ప్రస్తావించారు. ఇదే విషయమై సోఫియా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇప్పుడు ఆమె దేశాన్ని గర్వపడేలా సేవలు అందిస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనల విన్న కోర్టు.. తదుపరి విచారణ వరకు పిటిషన్లు వేసిన అధికారులను విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.ఆర్మీలో తమకూ శాశ్వత కమిషన్ (పీసీ) అవకాశం కల్పించాలన్న మహిళా సైనికాధికారులు కొన్నేళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఆ సందఠంగా కర్నల్ సోఫియా విజయపరంపర సర్వోన్నత న్యాయస్థానం ద ృష్టికి వచ్చింది. ఆమె సేవలను సోదాహరణగా చూపుతూ మహిళలూ ఆర్మీలో శాశ్వత కమిషన్‌కు అర్హులేనంటూ 2020 ఫిబ్రవరి 17న వెలువరించిన తీర్పులో విస్పష్టం చేసింది. అప్పటి వరకూ ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)కే పరిమితం చేస్తున్న పరిస్థితి. మహిళల శారీరక స్వభావాన్ని, సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్‌ను నిరాకరిస్తున్నారు. ఈ వాదనలను సమర్థిం చలేమంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2016లో పుణెలో ‘ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18’ పేరిట నిర్వహించిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో భారత సైనిక దళానికి అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ (ఆర్మీ సిగల్ కోర్) సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. ఆ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఐక్యరాజ్యసమితి పీస్‌మిషన్‌లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. సోఫియా సాధించిన ఇతర విజయాలనూ ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మహిళలకూ శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది.
వారి స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
- Advertisement -
- Advertisement -