దీనివల్ల లైంగిక దోపిడీ పెరుగుతుంది :
సుప్రీంలో కేంద్రం అభ్యంతరం
న్యూఢిల్లీ : పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు నెరిపేందుకు చట్టబద్ధమైన వయస్సును 18నుంచి 16ఏండ్లకు తగ్గించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి మార్పు వల్ల బాలల రవాణా మరింతగా పెచ్చరిల్లుతుందని, లైంగిక దుర్వినియోగ సంఘటనలు ఎక్కువవుతాయని హెచ్చరించింది. ‘పరస్పర అంగీకారంతో’ అనే ముసుగులో ఈ అరాచకాలన్నీ జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా వుంటుందని పేర్కొంది. బాలల రక్షణ చట్టాలు నీరుగారుతాయని ఆందోళన వెలిబుచ్చింది. ఈ మేరకు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భటి రాతపూర్వకమైన వాదనలను సుప్రీంకోర్టుకు అందచేశారు. లైంగిక వేధింపులకు గురయ్యే చిన్నారుల్లో మెజారిటీ బాధితులు తమకు బాగా తెలిసిన వారినుండే ఈ రకమైన ప్రవర్తనను ఎదుర్కొంటారని కేంద్రం పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా 2007 నాటి అధ్యయన వివరాలు ఉదహరించింది. మైనర్లకు అంత అవగాహనా స్థాయి వుండదని, అందువల్ల వారు నిజాయితీగా సమ్మతి లేదా ఆమోదం ఇవ్వలేరని వాదించింది. వారికి రక్షణ కల్పించేందుకే 18ఏండ్ల వయస్సు పరిమితిని విధించడం జరిగిందని పేర్కొంది. బాల్య వివాహాల చట్టం, బాలనేరస్తులచట్టం వంటి ఇతర చట్టాలకు అనుగుణంగా ఈ పరిమితి వుంటుందని పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం 18ఏండ్ల లోపు బాలికతో లైంగిక చర్యను అత్యాచారం కింద పరిగణిస్తారు. భారతదేశ రాజ్యాంగానికి, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచంగా చట్టం పనిచేయాలని కేంద్రం పేర్కొంది.
16ఏండ్లకు తగ్గించవద్దు
- Advertisement -
- Advertisement -