– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి : ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయ జోక్యం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని భావించాలని హితవుపలికారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై అఖిలపక్షాన్ని పిలిచి ప్రజలందరికీ తెలిసేలా నిజానిజాలు వివరించాలని కోరారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఇరు రాష్ట్రాల మధ్య తగువు పెట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఎస్టిమేషన్లు పెరిగి ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో జలవనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సాంకేతికంగా.. నికరజలాలు, మిగులు జలాలపై తేల్చిన తర్వాతే ముందుకు పోవాలని సూచించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని లిఫ్ట్‌లన్నీ ప్రాజెక్టు అంతర్భాగంగా చూడాలని, పూర్తి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్యా పాండునాయక్, పల్లె వెంకటరెడ్డి, వట్టెలపు సైదులు, మండల కార్యదర్శులు మాలోత్ బాలునాయక్, పోసనబోయిన హుస్సేన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, అంజి ఉన్నారు.
ప్రాజెక్టులపై రాజకీయం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES