Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'డబుల్‌' ఇండ్ల తాళాలు ఇవ్వాలి

‘డబుల్‌’ ఇండ్ల తాళాలు ఇవ్వాలి

- Advertisement -

– ఆర్డీఓ ఆఫీస్‌ వరకు పాదయాత్ర
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
– అధికారులతో చర్చలు విఫలం
నవతెలంగాణ-జహీరాబాద్‌
: అధికారులు చెప్పిన మాట ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు తాళాలు ఇవ్వాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారులు డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని హౌతికెలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ వద్ద శనివారం బైటాయించారు. ఎంతసేపైనా అధికారులు స్పందించక పోవడంతో అక్కడి నుంచి సుమారు 6 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కొద్దిసేపటి తర్వాత తహసీల్దార్‌ దశరథ్‌, ఆర్డీఓ కార్యాలయం ఏవో వంశీ, డీఎస్పీ సైదాతో నాయకులు చర్చలు జరిపారు. తాళాలు ఇస్తే తప్ప కదిలేది లేదని తేల్చి చెప్పారు. కానీ చర్చలు విఫలం కావడంతో అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. అంతకుముందు మార్గమధ్యలో పోలీసులు అడ్డగిస్తే రోడ్డుపై బైటాయించడంతో పాదయాత్రకు అనుమతించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జహీరాబాద్‌ ఏరియా కమిటీ సభ్యులు ఎస్‌.మహిపాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు ప్రకటించిన తేదీ ప్రకారం శనివారం ఇవ్వాల్సిన తాళాలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పకుండా దాటవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగచాటుగా రాత్రికి రాత్రి ప్రకటనలు ఇవ్వడం సరైనది కాదన్నారు. లబ్దిదారులు, పేదలు సొంతిండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఇండ్ల తాళాలు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే లబ్దిదారులకు తాళాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తిరుపతి, సలీముద్దీన్‌, బక్కన్న, లబ్దిదారులు స్వప్న, పుష్ప, నాగమ్మ, శివకుమార్‌, శ్రీనివాస్‌, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -