నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో వరకట్న చావులు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల కాలంలో నోయిడా, యూపీ, రాజస్థాన్‌లో.. ఇలా దేశంలో ఎక్కడొక చోట వరకట్న పిశాచికి బలైపోతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శిల్ప (27) వరకట్న దాహానికి బలైపోయింది. భర్త, అత్తమామల వేధింపులు కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. దక్షిణ బెంగళూరులోని సుద్దగుంటెపాల్యలోని ఇంట్లో మంగళవారం రాత్రి ఉరివేసుకుని మరణించింది. వరకట్న వేధింపులు కారణంగానే చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపించింది. కట్నం కోసం నిరంతరం వేధించడం వల్లే శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కూడా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
రెండున్నర సంవత్సరాలు క్రితం సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ప్రవీణ్‌ను శిల్ప వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. శిల్ప కూడా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. వివాహానికి ముందు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. ఇక ప్రవీణ్ ఒరాకిల్‌లో ఇంజనీర్‌గా వర్క్ చేశాడు. పెళ్లి తర్వాత రాజీనామా చేసి ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇక పెళ్లి సమయంలో ప్రవీణ్‌కు రూ.15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారం, అనేక వస్తువులు ఇచ్చారు. అయినా కూడా నిత్యం అదనంగా డబ్బులు తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాకుండా నల్లగా ఉన్నావంటూ వేధిస్తూనే ఉన్నారు. తన కొడుకును వదిలేసి వెళ్లాలంటూ అత్తగారు ఘోరంగా టార్చర్ పెడుతోంది. ఇక ఆరు నెలల క్రితం వ్యాపారం కోసం ప్రవీణ్‌కు రూ.5లక్షలు ఇచ్చారు. ఇంత ఇచ్చినా కూడా వేధింపులు ఆగలేదు. దీంతో శిల్ప ప్రాణాలు తీసుకుంది.
వరకట్న వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. భర్తను విచారిస్తున్నామని.. ఆరోపణల్లో నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.