నవతెలంగాణ-అశ్వారావుపేట: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు విశ్వవిద్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు అందాయి.
ఈయన ఇప్పటి వరకు ఆయన 31 రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. దాదాపు 57 పరిశోధనా పత్రాలు ప్రచురించారు. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఆయన 18 సంవత్సరాల సేవలో 2017 నుండి 2023 వరకు మొత్తం 31 అవార్డులను అందుకొన్నారు.
అందులో ఉత్తమ విస్తీర్ణాధికారి,ఉత్తమ సైంటిస్ట్, ఉత్తమ మౌఖిక ప్రసంగి, పద్మశ్రీ ఐ.వి. సుబ్బారావు రైతు నేస్తం అవార్డ్ లాంటి మరెన్నో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు పొందారు. వ్యవసాయ రంగంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి మిర్చి, ప్రత్తి మరెన్నో వ్యవసాయ పంటలు సాగు,యాజమాన్య పద్దతులు పై విస్తారంగా వ్యవసాయ విస్తరణ సేవలు, వ్యవసాయ కళాశాలలో బోధనా, ప్రస్తుతం పాలన చేస్తూ అందరికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న ప్రతి శాస్త్రవేత్త, విద్యార్థిని విద్యార్థులు ఎప్పుడూ పురోగతి సాధించే దిశగా ప్రయాణించాలి అనే ఆలోచించే హేమంత కుమార్‌ను బోధనా బోధనేతర సిబ్బంది అభినందిస్తున్నారు.
