- తమిళనాడులో 44వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్
నవతెలంగాణ-హైదరాబాద్: వెల్లోర్ (తమిళనాడు) లోని వీఐటి యూనివర్సిటీలో నిర్వహించిన 44వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్‌లో సూర్యాపేట జిల్లా అన్నారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు డా. షేక్ జెబున్నిసా పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. “2014–2024 కాలంలో తెలంగాణలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి విధానాలు” అనే అంశంపై ఆమె సమర్పించిన పత్రం విద్యావేత్తల నుంచి విశేష ప్రశంసలు పొందింది.
ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్, దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ అధ్యక్షులు ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాది డా. షేక్ జెబున్నిసా పరిశోధనా కృషిని అభినందించారు. మైనారిటీల అభివృద్ధి విధానాలను చారిత్రక దృష్టితో విశ్లేషించిన ఆమె పత్రం సమకాలీన సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు డా. షేక్ జెబున్నిసాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలతో విద్యా రంగానికి సేవలందించాలని ఆకాంక్షించారు.




